ఉత్తర్‌ప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో అభ్యర్థి ఎంపిక విషయంలో సొంత పార్టీకే షాకిచ్చారు బీఎస్పీ ఎమ్మెల్యేలు. పార్టీ అభ్యర్థిగా రామ్‌జీ గౌతమ్‌ను ప్రతిపాదించిన 10 మంది ఎమ్మెల్యేల్లో ఐదుగురు తమ మద్దతును ఉపసంహరించుకున్నారు. నామినేషన్ పత్రాలపై తమ సంతకాలను ఫోర్జరీ చేసినట్లు ఆరోపించినట్లు తెలుస్తోంది.
ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారే యోచనలో ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నవంబర్ 9న జరిగే రాజ్యసభ ఎన్నికల కోసం రామ్‌జీ నామినేషన్ దాఖలు చేసిన తర్వాత రోజే ఈ నాటకీయ పరిణామాలకు తెరలేసింది. నామినేషన్లకు సంబంధించి బుధవారం (ఇవాళ) స్క్రూటినీ నిర్వహించనున్నారు.
ఇతర పార్టీల మద్దతు ఆశించి..
పార్టీ జాతీయ సమన్వయ కర్త గౌతమ్‌ను రాజ్యసభ ఎన్నికల్లో నిలబెట్టాలని బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి సోమవారం నిర్ణయించారు. తమ అభ్యర్థిని గెలిపించుకునే మెజారిటీ లేకపోయినా గౌతమ్‌ను పోటీలో నిలిపింది బీఎస్పీ. భాజపాయేతర పార్టీలు మద్దతు లభిస్తుందన్న భావనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఉత్తర్‌ప్రదేశ్‌లో ఖాళీ అయిన 10 సీట్లలో 8 అధికార భాజపా దక్కించుకునే అవకాశం ఉంది.
ఇదీ చూడండి: బిహార్ బీఎస్పీకి షాక్.. ఆర్జేడీలోకి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు