కేంద్ర పాలిత ప్రాంతాలుగా అవతరించిన జమ్మూ, కశ్మీర్‌లలోని రెండు జిల్లాల్లో హైస్పీడ్ (4జీ) ఇంటర్‌నెట్ మొబైల్ సేవలను ట్రయల్ ప్రాతిపదికన ఆదివారం నుంచి ప్రారంభించినట్లు అధికారులు వెల్లడించారు. జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దుచేస్తూ కేంద్ర ప్రభుత్వం గతేడాది నిర్ణయం తీసుకుంది. ఈ ప్రకటనను వెలువరించడానికి ముందే కేంద్రం ముందుజాగ్రత్త చర్యగా కశ్మీర్ లోయలో ఇంటర్‌నెట్ సేవలను నిలిపివేసింది. అనంతరం తక్కువ వేగవంతమైన 2జీ ఇంటర్నెట్ సేవలను అక్కడ అందుబాటులోకి తెచ్చారు.
హైస్పీడ్ ఇంటర్‌నెట్ సేవల పునరుద్దరణపై ప్రత్యేక కమిటీ పరిశీలిస్తోందని కేంద్రం సుప్రీం కోర్టుకు తెలిపిన రోజుల వ్యవధిలోనే తాజా ప్రకటన వెలువడటం గమనార్హం. కశ్మీర్‌లోని గందర్‌బల్ జిల్లా, జమ్మూలోని ఉదంపూర్ జిల్లాలో 4జీ సేవలను ప్రారంభిస్తున్నట్లు అక్కడి హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు సెప్టెôబర్ 8 వరకు అమలులో ఉంటాయని పేర్కొంది. హైస్పీడ్ సేవలను కేవలం పోస్ట్ పెయిడ్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులోకి తెస్తున్నట్లు వివరించారు. వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేసుకున్న తర్వాతే ప్రీపెయిడ్ వినియోగదారులకు ఈ సేవలను అందిస్తారని తెలిపారు.