వైద్య కళాశాలల్లో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యూయేట్ కోర్సులకు సంబంధించి... రెండేళ్లలో 24,698 సీట్లు పెరిగాయని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ లోక్‌సభలో తెలిపారు. ఆర్థికంగా వెనకబడిన విద్యార్థులకు ఈ ఏడాది నీట్లో 4,800 సీట్లు కేటాయించామని వివరించారు.
"ఈ ఒక్క ఏడాదిలోనే నీట్‌కు చెందిన సుమారు 4వేల 800 మెడికల్ సీట్లు ఆర్థికంగా వెనకబడిన విద్యార్థుల కోసం కేటాయించాం. కొన్ని నెలల వ్యవధిలోనే నీట్లో 15 వేల సీట్లు పెరిగాయి. ఇప్పుడు నీట్లో సీట్ల సంఖ్య 75వేలకు చేరుకుంది. ఇది ఒక రికార్డు."
-హర్షవర్ధన్, ఆరోగ్యశాఖ మంత్రి.
దేశవ్యాప్తంగా ఉన్న వైద్య సంస్థలు, కళాశాలల్లో సీట్లు పెంచడానికి మోదీ ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టిందని హర్షవర్ధన్ తెలిపారు. ఎమ్‌బీబీఎస్ కోర్సు గుర్తింపు పొందిన మూడేళ్లలోనే పీజీ కోర్సులనూ కచ్చితంగా ప్రారంభించాలని అన్ని వైద్య కళాశాలను ఆదేశించినట్టు వివరించారు. కేంద్ర ప్రభుత్వ ఆధారిత పథకం ద్వారా దేశంలో 82 కొత్త కళాశాలలను ఏర్పాటు చేస్తున్నట్టు లోక్‌సభలో మరో ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానం సమర్పించారు. ఈ పథకం కింద 60శాతం నిధులు కేంద్రం మంజూరు చేస్తుందని, మిగిలిన నిధులు సంబంధిత రాష్ట్రం కేటాయించాలని తెలిపారు.