పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో మొత్తం 47 అంశాలపై సభ్యులు చర్చించనున్నారు. ఇవాళ్టి నుంచి సమావేశాలు ప్రారంభం కానుండగా.. ఇందులో చర్చించే విషయాలపై పార్లమెంట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది. మొత్తం 47 అంశాల్లో 45 బిల్లులు, రెండు ఆర్థిక అంశాలపై సభ్యులు చర్చించనున్నట్లు ప్రకటనలో పేర్కొంది.
అక్టోబర్ 1 వరకు సమావేశాలు జరగనున్నాయి. మొత్తం 18 రోజుల పాటు ఉభయసభలు భేటీ కానున్నాయి. 11 ఆర్డినెన్సుల స్థానంలో 11 బిల్లులను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ఇందులో ప్రధానంగా రైతు ఉత్పత్తులకు వాణిజ్య సౌకర్యం కల్పించే బిల్లు, ధరల భరోసా, వ్యవసాయ సేవల బిల్లు, అత్యవసర సరకుల చట్ట సవరణ సహా పలు బిల్లులు ఉన్నాయి.
పెండింగ్లో ఉన్న పలు బిల్లులను పార్లమెంట్ ఆమోదించాల్సి ఉందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. పురుగులమందుల నిర్వహణ బిల్లు, నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్, నేషనల్ కమిషన్ ఫర్ హోమియోథెరపీ, కంపెనీల చట్ట సవరణ బిల్లు, ఎయిర్క్రాఫ్ట్ చట్ట సవరణ వంటి పలు బిల్లులు ఇందులో ముఖ్యమైనవని తెలిపింది.