భారత్లో ఓ వైపు కరోనా కేసులు ఆందోళనకర రితీలో నమోదవుతుండగా .. మరోవైపు కోలుకుంటున్న వారి సంఖ్య కూడా రికార్డు స్థాయిలో పెరుగుతుండటం ఊరటనిస్తోంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 36వేల 145మంది కరోనా బారి నుంచి కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు ఇదే రికార్డని పేర్కొంది. ఫలితంగా దేశంలో కొవిడ్ రికవరీ రేటు 63.92 శాతానికి పెరిగినట్లు వెల్లడించింది. మరణాల రేటు 2.31శాతానికి తగ్గినట్లు చెప్పింది.
దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 8లక్షల 85వేల 576కి చేరినట్లు అధికారులు తెలిపారు. యాక్టివ్ కేసుల కంటే రికవరీ కేసుల శాతం 1.89రెట్లు ఎక్కువ ఉన్నట్లు వివరించారు.
కరోనా పరీక్షల సామర్థ్యాన్ని కూడా భారీగా పెంచినట్లు కేంద్రం తెలిపింది. 24 గంటల్లో 4లక్షల 42వేల 263 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది. సగటున 10లక్షల మందికి 11వేల 850నమూనాలు సేకరిస్తున్నట్లు వెల్లడించింది.