జమ్ముకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వద్ద సైన్యం జరిపిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు మరణించారు. పాకిస్థాన్‌లో శిక్షణ పొందిన ముగ్గురు ముష్కరులు నౌషహరా సెక్టారు మీదుగా నియంత్రణ రేఖ దాటి చొరబడుతుండగా భారత సైన్యం వారిపై కాల్పులు జరిపింది.
మే 28 నుంచి చొరబాటు యత్నాలను తిప్పికొట్టేందుకు బలగాలు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. సరిహద్దువద్ద హైఅలర్ట్‌గా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఉగ్రవాదులను అక్రమంగా భారత్‌లోకి పంపించేందుకు పాక్ ప్రయత్నిస్తుందని నిఘా వర్గాలు ఇప్పటికే వెల్లడించాయి. పాకిస్థాన్ పోస్ట్, గురేజ్ సెక్టార్ ఎదురుగా ఉన్న సర్దారీలో గుర్తుతెలియని తీవ్రవాదులు దేశంలోకి చొరబడేందుకు యత్నిస్తున్నట్లు నిఘా వర్గాలు పేర్కొన్నాయి.
కేల్, తేజియాన్ ప్రాంతాల వద్ద జైషే మహ్మద్ సంస్థకు చెందిన మరో ఉగ్రవాద సమూహం పొంచి ఉన్నట్లు సమాచారం. వీరు మాచల్ సెక్టార్ వద్ద చొరబాటుకు యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్, నియంత్రణ రేఖ వద్ద 15 లాంచ్ ప్యాడ్ల నిండా ఉగ్రవాదులు నిండి ఉన్నట్లు సీనియర్ సైనికాధికారి పేర్కొన్నారు.