మధ్యప్రదేశ్ బార్వానీ ప్రాంతంలో ఓ వ్యక్తి వద్ద 27 కిలోల బరువున్న 2,484 పురాతన వెండి నాణేలను పోలీసులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. సదరు వ్యక్తిని రోజుకూలీగా గుర్తించారు. తన ఇంటి వెనుక భాగంలో తవ్వినప్పుడు పురాతన నాణేలు బయటపడినట్లు పోలీసులు తెలిపారు.
నాణేల విషయాన్ని బయటకు పొక్కకుండా ఎంతో జాగ్రత్త పడ్డాడు ఆ కూలీ. వీటిని అంతర్జాతీయ మార్కెట్లో అమ్మాలని నిర్ణయించుకున్నాడు. కానీ స్థానికంగా ఉన్న ఇన్ఫార్మర్కు ఈ విషయం తెలియటం వల్ల అతను పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో అధికారులు కార్మికుడి నుంచి నాణేలను స్వాధీనం చేసుకున్నారు.
నాణేలను పరీక్షించగా వాటిపై అరబిక్ భాషలో కొన్ని అక్షరాలు ఉన్నట్లు గుర్తించారు. కానీ అవి ఏ కాలానికి చెందినవో తెలియరాలేదని పోలీస్ అధికారి రూప్రేఖా యాదవ్ తెలిపారు. దాదాపు వీటి విలువ 14 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. వీటిని పురావస్తుశాఖకు అప్పగించినట్లు తెలిపారు. ఈ నాణేలపై విచారణ చేస్తున్నట్లు పేర్కొన్నారు.