భారత నౌకా దళంలో కరోనా కలకలం రేపింది. 26 మంది సిబ్బందికి వైరస్ సోకినట్లు తేలింది. వీరు ముంబయిలోని పశ్చిమ నావల్ కమాండ్‌లో విధులు నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
"ముంబయి నావిక దళంలోని మొత్తం 26 మంది సభ్యులకు కరోనా పరీక్షలు నిర్వహించగా వారికి పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. వీరిలో 25 మంది ఐఎన్ఎస్ అంగ్రేకి చెందిన వారు."
-భారత నౌకా దళం ప్రకటన.
ముంబయిలోని నౌకా దళానికి చెందిన ఆసుపత్రిలో బాధితులకు చికిత్స అందిస్తున్నారు.
కుటుంబసభ్యులకూ...
బాధితుల్లో 25 మంది ఐఎన్ఎస్ బ్లాక్‌లో, మరొకరు తన తల్లితో కలిసి సొంత ఇంటిలో నివసిస్తున్నారు. సొంత ఇంటిలో ఉంటున్న వ్యక్తి తల్లికి పరీక్షలు నిర్వహించగా వైరస్ సోకినట్లు తేలింది. ఈ తరుణంలో వారు నివసించే ప్రాంతాన్ని 'కంటైన్మెంట్ జోన్'గా ప్రకటించారు. అక్కడ ఉండే ప్రతి ఒక్కరిని నిర్బంధ కేంద్రానికి తరలించారు.
ఆ సైనికుడి నుంచే..
ఏప్రిల్ 7న ఓ సైనికుడికి వైరస్ లక్షణాలు కనిపించగా, అతడికి నిర్వహించిన పరీక్షలో పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. సదరు వ్యక్తి నుంచే అందరికి సంక్రమించి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.
సైన్యంలో 8 మందికి..
భారత సైన్యాన్నీ వైరస్ వదల్లేదు. ఇప్పటి వరకు 8 మంది సైనికులు వైరస్ బారిన పడ్డారు. వీరిలో ఇద్దరు వైద్యులు, ఒకరు నర్సు కాగా.. మిగిలిన వారు జవాన్లు. ప్రస్తుతం వీరంతా కోలుకుంటున్నారు.
అమెరికా, ఫ్రాన్స్‌లోనూ...
అమెరికా నౌకా దళంలోనూ వైరస్ వ్యాప్తి చెందుతోంది. ఆ దేశానికి చెందిన థియోడర్ రూజ్‌వెల్ట్ విమాన వాహక నౌకలో 500 మందికి వైరస్ సోకింది. ఫ్రాన్స్ నౌకా దళ సిబ్బందీ కరోనా బారినపడ్డారు.