పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన హింసాత్మక నిరసనల్లో భాగంగా రైల్వే ఆస్తులను ధ్వంసం చేసిన వారిని అరెస్టు చేసినట్లు రైల్వే పోలీస్ అధికారులు తెలిపారు. అసోం, బంగాల్, బిహార్ పరిధిలో 21 మందిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.
నిరసనలపై రైల్వే పోలీసులు 27 కేసులు నమోదు చేయగా... ఇండియన్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సర్వీస్ 54 కేసులు నమోదు చేసింది.
"ఇప్పటివరకు 21 మందిని అరెస్టు చేశాం. కొంతమందిని నిరసనలు జరిగిన సమయంలోనే అదుపులోకి తీసుకున్నాం. మరికొంత మందిని వీడియో ఫుటేజీ ఆధారంగా గుర్తించి అరెస్టు చేశాం. మరిన్ని హింసాత్మక ఘటనల దృశ్యాలను పరిశీలిస్తున్నాం. అరెస్టయ్యే వారి సంఖ్య పెరగొచ్చు. అరెస్టయిన వారిలో బంగాల్ నుంచే ఎక్కువ మంది ఉన్నారు."
-రైల్వే పోలీస్ అధికారి
ధ్వంసమైన రూ.87.99 కోట్ల విలువైన ఆస్తులకు నష్ట పరిహారాన్ని నిందితుల నుంచి వసూలు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇందుకోసం వాణిజ్య శాఖ ద్వారా నిందితులకు నోటీసులు పంపించనున్నట్లు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: బాలీవుడ్ యువ నటిని వేధించిన వ్యక్తికి మూడేళ్ల జైలు