పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేశ రాజధాని దిల్లీలోని దర్యాగంజ్లో శుక్రవారం చెలరేగిన హింసాత్మక ఘటనలపై చర్యలు చేపట్టారు పోలీసులు. అల్లర్లకు సంబంధం ఉన్న 15 మందిని శనివారం అరెస్ట్ చేశారు. నిన్న నిర్బంధంలోకి తీసుకున్న 40 మందిలో 10 మందిని నేడు అరెస్ట్ చేశారు. మరో ఐదుగురిని తర్వాత అదుపులోకి తీసుకున్నారు.
నిన్న 40 మంది..
అల్లర్లు సృష్టించటం, పోలీసుల విధులకు ఆటంకం కలిగించటం వంటి అంశాలపై చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. శుక్రవారం సాయంత్రం సుభాశ్ మార్గ్ ప్రాంతంలో ఓ ప్రైవేటు కారుకు కొంతమంది నిప్పుపెట్టినట్లు గుర్తించామన్నారు. ఇప్పటి వరకు 40 మందిని నిర్బంధంలోకి తీసుకోగా.. అందులో 8 మంది మైనర్లను విడుదల చేసినట్లు చెప్పారు. మరింత మందిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉందన్నారు.
న్యాయవాదులను అనుమతించాలి: కోర్టు
దిల్లీ దర్యాగంజ్ అల్లర్లకు సంబంధించి అదుపులోకి తీసుకున్న 40 మందిని న్యాయవాదులు కలిసేందుకు అనుమతించాలని ఆదేశించింది దిల్లీ కోర్టు. న్యాయ సహాయం అందించాలని పేర్కొంటూ.. దర్యాగంజ్ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు చీఫ్ మెట్రోపోలిటన్ మెజిస్ట్రేట్ అరుల్ వర్మా. అవసరమైన వైద్య సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సూచించారు. మైనర్లను అరెస్ట్ చేయటాన్ని తప్పుపట్టారు.
ఇదీ చూడండి: యూపీ 'పౌర' అల్లర్లలో 11కి చేరిన మృతులు