ఉత్తర్ ప్రదేశ్‌లో విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వెలుగు చూసింది. రాష్ట్రంలోని హాపూర్ పరిధిలోని ఛామ్రీ గ్రామానికి చెందిన షామీమ్ అనే నిరుపేదకు ఏకంగా రూ.128 కోట్ల 45 లక్షల విద్యుత్ బిల్లు వేశారు. బిల్లు కట్టలేదని విద్యుత్ కనెక్షన్ తొలగించారు.
బిల్లును చూసి షాకైన షామీమ్ విద్యుత్ అధికారుల వద్దకు వెళ్లి నిలదీశాడు. ఇంతమొత్తంలో ఎందుకు కట్టాలో చెప్పాలని కోరాడు. ఎంతమాత్రం స్పందించని అధికారులు రూ.128 కోట్లు కట్టి తీరాలని, లేకపోతే విద్యుత్ కనెక్షన్ తిరిగి ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. ఏం చేయాలో తెలియని స్థితిలో షామీమ్ మీడియాను ఆశ్రయించాడు. తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకొన్నాడు.
'ఇది నా ఇంటి వరకే వచ్చినట్లు లేదు. రాష్ట్రం మొత్తం బిల్లు నాతోనే కట్టించాలనుకున్నారేమో. నాకు న్యాయం చేయండి' అని ఆవేదన వ్యక్తం చేశాడు షామీమ్.
"ఇంట్లో ఒక లైటు, ఒక ఫ్యాను మాత్రమే ఉపయోగించుకుంటాం. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. మాది పేద కుటుంబం. ఇంత మొత్తం బిల్లు ఎక్కడి నుంచి తీసుకొచ్చి కట్టాలి. విద్యుత్ కనెక్షన్ తొలగించారు. బిల్లు కడితేనే పునరుద్ధరిస్తామని అంటున్నారు."
-ఇంటి యజమాని భార్య.
ఈ విషయం మీడియాకు తెలిసేసరికి దిద్దుబాటు చర్యలు చేపట్టారు అధికారులు. సాంకేతిక పొరపాటు కారణంగానే అంత మొత్తం బిల్లు వచ్చినట్లు స్థానిక అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ రామ్ శరణ్ చెప్పారు.
"సాంకేతిక సమస్య కారణంగానే పొరపాటు జరిగింది. ఇదేం పెద్ద విషయం కాదు. మా వద్దకు వస్తే సరిచేస్తాం."
-రామ్ శరణ్,అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇంజనీర్