గుజరాత్ అహ్మదాబాద్లో ఒకేసారి 1100 జంటలు ఒక్కటయ్యాయి. ఈ సామూహిక వివాహ కార్యక్రమంలో హిందూ, ముస్లిం సంప్రదాయాల ప్రకారం పెళ్లిళ్లు నిర్వహించారు. ఈశా ఫౌండేషన్ ట్రస్ట్ ఈ వివాహ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. కార్యక్రమం అనంతరం ట్రస్ట్ తరఫున జంటలకు ఖురాన్, భగవద్గీతలను వివాహ కానుకగా అందజేశారు. ఎనిమిదేళ్ల నుంచి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ట్రస్ట్ నిర్వాహకులు వెల్లడించారు.
"హిందూ-ముస్లింలు అంతా ప్రారంభంలో ఒక్క తల్లిదండ్రుల పిల్లలే. మన రక్తమంతా ఒకేలా ఉంటుంది. హిందూ, ముస్లిం అన్నది కేవలం గుర్తింపు కోసమే. మానవతా విలువలతో పేదవారికి సహాయం చేయడం ఈశా ఫౌండేషన్ ప్రథమ లక్ష్యం. దీనిలో భాగంగానే అంతా కలిసి మతభేదం లేకుండా వివాహలు నిర్వహించడం.. కలిసి కూర్చోని తినడం..ద్వారా హిందూ-ముస్లిం అన్న వైరుధ్యం లేకుండా అంతా మానవులే అన్న సందేశాన్ని ఇస్తున్నాం."
-ఈశా ఫౌండేషన్ ప్రతినిధి
ఈ సామూహిక వివాహ కార్యక్రమం మతసామరస్యానికి చక్కటి ఉదాహరణగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు కార్యక్రమానికి హాజరైన ఓ పూజారి.
"నేటి ఈ కార్యక్రమం ప్రపంచమంతా చూడతగింది. హిందూ, ముస్లింలు ఒకే వేదికపై కూర్చుని.. వారి వారి కార్యక్రమాలను నిర్వహించుకోవచ్చని నిరూపించింది. ముస్లిం సంప్రదాయం ప్రకారం నిఖా జరుగుతుండగా.. హిందూ ధర్మం ప్రకారం వివాహాలు నిర్వహిస్తున్నాం. భారత్లో ఇది ఒక చక్కటి ఉదాహరణగా నిలుస్తుంది. ఈ కార్యక్రమాన్ని దైవం ఆశీర్వదించి మరింత ముందుకు తీసుకెళ్లాలి."
- పూజారి
ఇదీ చూడండి: ఇక్కడ లిక్కర్ కంటే చదరంగానికే కిక్కు ఎక్కువ.!