కర్ణాటక, గోవా రాష్ట్రాల్లో రాజకీయ సంక్షోభం కొనసాగుతోన్న తరుణంలో బంగాల్లో భారీ స్థాయిలో వలసలు ఉండబోతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు భాజపా సీనియర్ నాయకుడు ముకుల్ రాయ్. రాష్ట్రంలోని వివిధ పార్టీలకు చెందిన 107 మంది కాషాయ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారని వెల్లడించారు.
ముఖ్యమంత్రి మమత బెనర్జీ నేతృత్వంలోని ప్రభుత్వంపై పలువురు టీఎమ్సీ జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి నాయకులు నమ్మకం కోల్పాయారని తెలిపారు రాయ్.
" దాదాపు 107 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారు. అందులో ఎక్కువ మంది టీఎంసీ నాయకులే. కాంగ్రెస్, సీపీఎం నుంచి కొందరు ఉన్నారు. వారు త్వరలోనే కాషాయ పార్టీలో చేరాలని అనుకుంటున్నారు."
- ముకుల్ రాయ్, భాజపా సీనియర్ నాయకుడు.
పలువురు టీఎమ్సీ కౌన్సిలర్లు భాజాపాలో చేరి తిరిగి సొంత పార్టీకి వచ్చిన క్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు రాయ్.
లోక్సభ ఎన్నికల్లో బంగాల్లో 42 స్థానాలకు గాను భాజపా 18 సీట్లు గెలుపొందింది. అనంతరం ఆరుగురు టీఎమ్సీ.. కాంగ్రెస్, సీపీఎంల నుంచి తలా ఒక ఎమ్మెల్యే భాజపా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.