బల పరీక్షకు ఒక్కరోజు ముందు కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప.. సభలో నూటికి నూరు శాతం తన బలాన్ని నిరూపించుకుంటానని ధీమా వ్యక్తం చేశారు. గత కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం రూపొందించిన ఆర్థిక బిల్లుకు ఎలాంటి మార్పులు లేకుండా సభలో ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొన్నారు.
ఆర్థిక బిల్లు అత్యవసరంగా సభామోదం పొందాల్సిన అవసరముందన్నారు యడ్డీ. లేని పక్షంలో జీతాలు చెల్లించేందుకు కూడా ప్రభుత్వానికి కష్టంగా మారుతుందన్నారు.
14 నెలల కాంగ్రెస్-జేడీఎస్ కూటమి ప్రభుత్వం సభ విశ్వాసాన్ని కోల్పోయింది. అనంతరం గత శుక్రవారమే కన్నడ పీఠాన్ని నాలుగోసారి అధిష్టించారు యడియూరప్ప. సోమవారం కన్నడ విధానసౌధలో బల నిరూపణ చేసుకోనున్నారు యడ్డీ.
స్పీకర్ నిర్ణయాన్ని స్వాగతించిన సిద్ధరామయ్య
14 మంది రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసిన స్పీకర్ నిర్ణయాన్ని స్వాగతించారు కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు సిద్ధరామయ్య. స్పీకర్ నిర్ణయం అవకాశవాద రాజకీయాలకు గొడ్డలిపెట్టు లాంటిదని, ప్రజాస్వామ్యానికి నిజమైన విజయమని పేర్కొన్నారు.
" ప్రభుత్వాలు వస్తుంటాయి.. పోతుంటాయి.. అధికారం శాశ్వతం కాదు. చట్టసభల్లో పాటించే సంప్రదాయాలే భావితరాలకు ఆదర్శం"
-సిద్ధరామయ్య, కాంగ్రెస్ కర్ణాటక అధ్యక్షుడు