ఒళ్లంతా ముక్కలైనట్లుండే వింత వ్యాధితో ఆపసోపాలు పడుతున్నాడు ఒడిశా గుంజమ్ జిల్లాకు చెందిన పదేళ్ల జగన్నాథ్.
జగన్నాథ్ తండ్రి ప్రభాకర్ ప్రధాన్.. తల్లి సుష్మా. స్వస్థలం సెర్గఢ్లోని గోఠాగావ్లో ఇతరుల భూమిని కౌలుకు తీసుకుని సేద్యం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఈ దంపతులకు జగన్ కన్నా ముందే నలుగురు కొడుకులు, ఒక కూతురు పుట్టి వింత వ్యాధి సోకి మరణించారు. ఆరో సంతానంగా జగన్నాథ్ పుట్టాడు. ఏమైందో తెలియదు, జగన్ కూడా అదే మహమ్మారి వ్యాధితో జన్మించాడు.
ఇప్పుడు జగన్నాథ్‌కు 10 ఏళ్లు.. పుట్టినప్పటి నుంచి బెర్హంపుర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కానీ ఫలితం లేదు. ఇతర అధునాతన ఆసుపత్రుల్లో వైద్యం చేయిద్దామంటే చిల్లి గవ్వ లేకుండాపోయింది. ఇప్పటికే జగన్ చికిత్స కోసం స్థోమతకు మించి రూ.7 లక్షలు అప్పు చేశాడు ప్రభాకర్.
నరకయాతన..
శరీరమంతా పగుళ్లతో బీడువారిపోయింది.. భరించలేని మంట, దురదలతో నిత్యం బాధపడుతుంటాడు జగన్. నొప్పి తీవ్రమైతే.. నీటి గోళంలో కూర్చుంటాడు. ఇక ఎండాకాలంలో జగన్ పడే అవస్థలు వర్ణానాతీతం.
కడుపున పుట్టిన కొడుకు.. కళ్ల ముందే నొప్పితో తల్లడిల్లుతుంటే తల్లిదండ్రుల ప్రాణం తరక్కుమంటుంది. ఏళ్లుగా జగన్ బాధను చూసి ఏడ్చి, ఏడ్చి ఇప్పుడు ఏడ్చేందుకు కన్నీళ్లు కూడా ఇంకిపోయాయి. కానీ, ఇప్పటికీ వారికి పరిష్కారం దొరకడంలేదు.
తల్లిదండ్రులే నేస్తాలు..
ఇదివరకు అందరి పిల్లల్లాగానే స్కూల్‌కు వెళ్లేవాడు జగన్. కానీ, శరీరంలో శక్తి లేక బల్ల మీద నుంచి పడిపోయేవాడు. ముడతలు పడే తన చర్మాన్ని చూసి మిగతా పిల్లలంతా భయపడేవారు. జగన్ వ్యాధి తమకు సోకుతుందేమోనని కొంతమంది పారిపోయేవారు. అందుకే పాఠశాలకు వెళ్లడమే మానేశాడు జగన్.
తన బాహ్య సౌందర్యం ఎలా ఉన్నా.. నిరంతరం తన కోసమే తపించే అమ్మ నాన్నలే తనకు నేస్తాలయ్యారు. ఏ స్నేహితులూ భర్తీ చేయలేని స్థానం తల్లిదండ్రులదేనని గ్రహించాడు జగన్. అందుకే ఎక్కడికి వెళ్లినా అమ్మ వేలు పట్టుకుని చకచకా నడిచేస్తాడు. తన బాధను తండ్రితోనే పంచుకుంటాడు.
ప్రభుత్వం స్పందించాలి!
పదేళ్లుగా కష్టాలు పడుతున్నా.. ప్రభుత్వ ఆరోగ్య పథకాలేవి ఆ కుటుంబానికి అందట్లేదు. ప్రభుత్వ పథకాలు వర్తించాలంటే వికలాంగ ధ్రువీకరణ పత్రం కావాలన్నారు. అందుకోసం జగన్‌ను వెంటబెట్టుకుని కార్యాలయాల చుట్టూ తిరిగి అధికారులకు విన్నవించుకున్నా లాభం లేకుండా పోయింది. ఆఖరికి జిల్లా కలెక్టర్‌ను ఆశ్రయించినా ఫలితం దక్కలేదు.
ప్రభుత్వం స్పందించి ఆధునిక వైద్యం అందిస్తే తన కొడుకు ప్రాణాలు నిలుస్తాయని ఆశిస్తున్నారు ఈ తల్లిదండ్రులు.
ఇదీ చదవండి:కదులుతున్న రైల్లో ఇలా ఎక్కి.. అలా పర్స్ కొట్టేశాడు!