సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత కాంగ్రెస్ మరింత చిక్కుల్లో పడింది. కర్ణాటకలో సంకీర్ణ సర్కారు పతనం అంచుల్లో ఉండగా... తాజాగా గోవా కాంగ్రెస్ సంక్షోభంలో చిక్కుకుంది. అక్కడ కాంగ్రెస్‌కు ఉన్న 15 మంది ఎమ్మెల్యేల్లో 10 మంది చీలిక వర్గంగా ఏర్పడి తమను భాజపాలో విలీనం చేయమని స్పీకర్ ను కోరారు.
విపక్షనేత చంద్రకాంత్ కావేల్కర్‌తో పాటు మరో 9 మంది కాంగ్రెస్ శాసనసభ్యులు తమను భాజపాలో విలీనం చేయమని స్పీకర్‌కు లేఖను సమర్పించారు. మరో వైపు గోవా సీఎం ప్రమోద్ సావంత్ శాసనసభలో తమ బలం 27కు పెరిగినట్లు స్పీకర్ రాజేష్ పట్నేకర్‌కు లేఖ సమర్పించారు.
ఈ రెండు లేఖలను ఆమోదించినట్లు ప్రకటించారు స్పీకర్. ఈ పరిణామంతో 2017 శాసనసభ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్‌కు ప్రస్తుతం ఐదుగురు ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలారు.
తాజా పరిణామాలతో 40 మంది సభ్యులున్న గోవా అసెంబ్లీలో భాజపాకు 27, కాంగ్రెస్‌కు 5, గోవా ఫార్వర్డ్ పార్టీకి 3, ఎన్సీపీ, ఎమ్జీపీలకు తలా ఒక్క సభ్యులు ఉన్నారు. మిగిలిన ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు. కాంగ్రెస్ పార్టీలోని మూడింట రెండొంతుల మంది భాజపాలో విలీనమయ్యారన్న సీఎం ప్రమోద్ సావంత్... వారిపై పార్టీ ఫిరాయింపుల నిషేధ చట్టం వర్తించదని వెల్లడించారు.
దిల్లీకి పయనం...
భాజపాలో విలీనం కోరుతూ లేఖ ఇచ్చిన 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గోవా సీఎం ప్రమోద్ సావంత్ దిల్లీకి తీసుకువెళ్లారు. భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాతో నేడు సమావేశం కానున్నట్లు ప్రమోద్ తెలిపారు.
- ఇదీ చూడండి: కన్నడనాట సంక్షోభం: ముంబయిలో హైడ్రామా