ఆర్టికల్ 370 రద్దుపై తమ వైఖరేంటో ప్రజలకు కాంగ్రెస్, ఎన్సీపీ స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు భాజపా అధ్యక్షుడు, కేంద్ర హోమంత్రి అమిత్ షా. ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న చారిత్రక నిర్ణయాన్ని దేశమంతా స్వాగతించినా ఆ 2 పార్టీలు వ్యతిరేకించాయని ఆరోపించారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సంగ్లీలో బహిరంగ సభలో పాల్గొన్నారు షా.
"కశ్మీర్లో ఆర్టికల్ 370ని రద్దు చేసి దేశంలో ఇద్దరు ప్రధానులు, రెండు చిహ్నాలు, రెండు విధానాలకు చరమగీతం పాడారు. అఖండ భారత దేశాన్ని ఏకం చేసే గొప్ప నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్, ఎన్సీపీలు 370 రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకించాయి. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఎన్సీపీ అధినేత శరధ్ పవార్లను అడగుతున్నా.. 370 రద్దును మీరు వ్యతిరేకిస్తున్నారా? స్వాగతిస్తున్నారా? మహారాష్ట్ర ప్రజలకు స్పష్టతనివ్వండి. "
-అమిత్ షా, భాజపా అధ్యక్షుడు
మోదీ పాలనతో జాతీయ భద్రత మరింత పటిష్ఠమైందన్నారు షా. ఒక్క భారత్ జవాను మరణిస్తే.. బదులుగా శత్రు దేశానికి చెందిన 10 మంది హతమవుతారని ప్రపంచానికి తెలిసిందని వ్యాఖ్యానించారు. పుల్వామా ఉగ్రదాడి అనంతరం భారత వాయుసేన బాలాకోట్‌లో నిర్వహించిన మెరుపుదాడులను గుర్తు చేశారు షా.