కర్ణాటక, బెంగళూరులోని సంకే ట్యాంక్ రోడ్లోని ఓ విగ్రహాన్ని అపవిత్రం కేసులో ఏడుగురు అనుమానితులను అరెస్ట్ చేశారు సదాశివ నగర్ పోలీసులు. అందులో కర్ణాటక రణధీర్ ఫోర్స్ అధ్యక్షుడు చేతన్ గౌడ, మాజీ ఎమ్మెల్యే నారాయణ్ కుమార్ కుమారుడు గురుదేవ్ నారాయణ్ కుమార్, అఖిల కర్ణాటక కన్నడ ఉద్యమ కేంద్ర కమిటీ అధ్యక్షుడు ఉన్నారు.
మహారాష్ట్రలోని కొల్హాపుర్లో కర్ణాటక జెండాను తగలబెట్టారన్న కోపంతో గత శుక్రవారం రాత్రి విగ్రహంపై నల్ల సిరా చల్లినట్లు పోలీసులు తెలిపారు. ఘటనకు నాలుగు రోజుల ముందే ప్రణాళికలు రచించినట్లు బెంగళూరు సెంట్రల్ డివిజన్ డీసీపీ అనుచేత్ తెలిపారు.
" ఘటనకు నాలుగు రోజుల ముందే శివాజీ విగ్రహాన్ని అపవిత్రం చేయాలని ప్రణాళిక రచించారు. గత సోమ, మంగళవారాల్లో సంకే ట్యాంక్లో రెక్కీ నిర్వహించారు. బుధవారం రాగా.. పెట్రోలింగ్ పోలీసులు వెనక్కి పంపించారు. విగ్రహం చాలా ఎత్తుగా ఉండటం వల్ల వాళ్లు నిచ్చెన తెచ్చుకున్నారు. శుక్రవారం రాత్రి 13 మంది ఓ కారు, రెండు ఆటోలు, ఒక బైక్పై వచ్చి విగ్రహంపై సిరా వేశారు. వరుణ్, వినోద్ సిరా వేస్తుంటే.. నవీన్ గౌడా వీడియో తీశాడు. దానిని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ఇప్పుడు మేము ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశాం. పరారీలో ఉన్న మిగతా వారి కోసం గాలింపు కొనసాగుతోంది. "
- అనుచేత్, బెంగళూరు సెంట్రల్ డివిజన్ డీసీపీ.
బైక్ ర్యాలీని అడ్డుకున్న పోలీసులు..
బెళగావిలో ఓ స్వాతంత్ర్య సమర యోధుడి విగ్రహాన్ని ధ్వంసం చేయాటాన్ని నిరసిస్తూ నగరంలో బైక్ ర్యాలీ చేపట్టింది కర్ణాటక రక్షా వేదిక(కరవే). వారిని అడ్డుకున్న పోలీసులు పదుల సంఖ్యలో కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. మూడు బస్సుల్లో పోలీస్ స్టేషన్కు తరలించారు. డిసెంబర్ 20వ తేదీ ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు ఉన్నందునే వారిని అడ్డుకున్నట్లు పోలీసులు తెలిపారు.
కఠిన చర్యలు తప్పవు: సీఎం
విగ్రహాల అపవిత్రం, ధ్వంసానికి పాల్పడిన దుండగులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై. పుకార్లు నమ్మటాన్ని మానుకోవాలని, దిగ్గజ వ్యక్తులను గౌరవించాలని ప్రజలకు సూచించారు. 'దేశభక్తులను గౌరవించాలని ప్రజలను కోరుతున్నా. వారు దేశం కోసం జీవితాలనే త్యాగం చేశారు. వారి గౌరవార్థంమే విగ్రహాలు ఏర్పాటు చేసుకున్నాం. భాషా రాజకీయల పేరుతో గొప్ప వ్యక్తులను అవమానించటం.. వారి జాతీయవాద స్ఫూర్తిని కించపరచటమే అవుతుంది. అది సహించరాని నేరం. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలించేందుకు అవకాశం ఇవ్వబోం. వారు ఎవరైనా కఠిన చర్యలు తప్పవు.' అని హెచ్చరించారు.
ఇదీ చూడండి: