నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. ఫేస్బుక్లో ప్రకటనలకు అధిక మొత్తం వెచ్చించిన రాష్ట్రంగా బంగాల్ పేరు సంపాదించింది. ఆ రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు కలిసి రూ.3.74 కోట్లు ఖర్చు చేశాయి.
బంగాల్ తర్వాతి స్థానాల్లోని రాష్ట్రాలు
- తమిళనాడు (రూ.3.3 కోట్లు)
- అసోం (రూ.61.77 లక్షలు)
- కేరళ (రూ.38.86 లక్షలు)
- పుదుచ్చేరి (రూ.3.34 లక్షలు)
బంగాల్లో టీఎంసీ ఖర్చులు ఇలా..
- ఫేస్బుక్ ప్రకటనల కోసం బంగాల్లో అన్ని పార్టీల కంటే మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అధికంగా ఖర్చు చేసింది. దాదాపు రూ.1.69 కోట్లను ఆ పార్టీ వెచ్చించింది.
- ఫేస్బుక్లో 'బంగ్లార్ గోర్బో మమతా'(బంగాల్‌కు మమత గర్వకారణం), 'దమ్-దమ్-ఏర్-గార్బో' పేరుతో టీఎంసీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తోంది.
- టీఎంసీ డిజిటల్ ప్రకటనలను ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ(ఐపీఏసీ) నిర్వహిస్తోంది. సామాజిక మాధ్యమాల్లో ఆ పార్టీకి సంబంధించి ప్రచార బాధ్యతలను కూడా ఐపీఏసీనే చూసుకుంటోంది.
- ఖోటికారోక్ మోదీ(హానికారక మోదీ) ఫేస్బుక్ పేజీ కోసం రూ.33.12 లక్షలు ఖర్చు చేసింది టీఎంసీ.
బంగాల్లో భాజపా ఖర్చులు..
- ఫేస్బుక్లో ప్రకటనల కోసం బంగాల్లోని భాజపా శాఖ రూ.25.31 లక్షలను ఖర్చు చేసింది. 'అమర్ పరివార్ భాజపా పరివార్', 'ఆర్ నోయ్ అన్నాయ్' వంటి ఫేస్బుక్ పేజీలతో ప్రచారాన్ని నిర్వహిస్తోంది.
- టీఎంసీ ఫేస్బుక్ పేజీకి 1.3 మిలియన్ల ఫాలోవర్లు ఉండగా.. బంగాల్ భాజపాకు 1.7 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.
మరోవైపు బంగాల్లో ఫేస్బుక్ ప్రకటనల కోసం కాంగ్రెస్ రూ.5 లక్షలు ఖర్చు చేసింది.
మార్చి 27 నుంచి వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది.
ఇదీ చూడండి:3000 అడుగుల 'మోదీ ముగ్గు'తో ప్రపంచ రికార్డ్