ఐదు అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ పార్టీల గుర్తులతో తయారు చేసిన వంటకాలను చూస్తూనేం ఉన్నాం. దీనికి కొద్దిగా భిన్నంగా ఎన్నికల్లో పోటీ చేసే ఆయా పార్టీల నినాదాలను స్వీట్లపై చిత్రించి వినియోగదారులను ఆకట్టుకుంటున్నాడు బంగాల్ ఉత్తర్ దినాజ్‌పుర్ జిల్లాకు చెందిన ఓ మిఠాయి దుకాణ యాజమాని.
రాయ్‌గంజ్‌లోని రసరాజ్ షాపు యజమాని.. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నినాదం.. ఖేలా హోబే (ఆట ఆరంభం), సీపీఐ(ఎం) (తుంప సోనా) సహా భాజపా(సోనార్ బంగ్లా) వంటి అన్ని రాజకీయ పార్టీల నినాదాలను స్వీట్లపై చిత్రిస్తున్నాడు. ఆకుపచ్చ, కాషాయం, ఎరుపు రంగుల్లో లభించే స్వీట్లకు మంచి గిరాకీ లభిస్తున్నట్లు చెబుతున్నాడు. ఒక్క స్వీటు రూ.10కి విక్రయిస్తున్నట్లు చెప్పాడు.
"ప్రజాస్వామ్యంలో ఎన్నికలు గొప్ప పండగ లాంటిది. గతంలో ఇటువంటి ప్రయోగాలు చేశాను. స్వీట్లపై పార్టీ గుర్తులను చిత్రించాను. ఈసారి నినాదాలు రాసి ఓ భిన్నమైన ప్రయత్నంతో ముందుకొచ్చాను"
- అరిజీ చౌదరి, షాపు యజమాని
ఈ కొత్త రకాల స్వీట్లకు ప్రజలు ఆకర్షితులవుతున్నారు. రసరాజ్ షాపు వివిధ స్వీట్లకు ప్రసిద్ధి అని.. ప్రత్యేకంగా దుర్గాపూజ వంటి పండగల సమయంలో ఇక్కడి స్వీట్లకు మంచి గిరాకీ ఉంటుందని స్థానికులు చెబుతున్నారు.
ఇదీ చూడండి: కేరళలో పార్టీ గుర్తులతో దోశలు.. భలే గిరాకీ