చెదురుమదురు ఘటనలు మినహా బంగాల్ రెండో దశ పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఒంటిగంట వరకు 58 శాతం పోలింగ్ నమోదైంది. జిల్లాల్లో పశ్చిమ్ మెదినీపుర్లో, నియోజకవర్గాల వారీగా నారాయణ్‌గఢ్‌లో ఎక్కువ శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, భాజపా అభ్యర్థి సువేందు అధికారి బరిలో ఉన్న నందిగ్రామ్‌లో 11 గంటల వరకే 37 శాతం మంది ఓటు వేశారు.
ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల బాటపట్టారు. ఈసారి మొదటి దశలో మొత్తం 84 శాతానికిపైగా ఓటింగ్ నమోదైంది.
2016లో రెండో దశలో 56 స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. మొత్తం 83 శాతం పోలింగ్ నమోదైంది.
హింసాత్మక ఘర్షణలు..
తొలి దశకు భిన్నంగా ఈసారి ఎన్నికలు జరుగుతున్నాయి. గురువారం పోలింగ్ ప్రారంభానికి కొద్ది గంటల ముందు ఓ తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తను గుర్తుతెలియని వ్యక్తులు పొడిచిచంపారు. ఇప్పటివరకు ఈ ఘటనకు సంబంధించి 8 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
నందిగ్రామ్ బ్లాక్-1 వద్ద కొంతమంది నిరసనకారులు రోడ్డుపై బైఠాయించారు. కేంద్ర బలగాలు తమను ఓటేయకుండా అడ్డుకున్నాయని ఆరోపించారు. భాజపా వీటిని ఖండించింది.
ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా పోలీసులు చూడట్లేదని భాజపా నేతలు ఆరోపించారు. పోలింగ్ కేంద్రాల్లో అవకతవకలకు పాల్పడే విధంగా తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలను అనుమతిస్తున్నారని చెబుతున్నారు.
ఓ భాజపా అభ్యర్థి కారును దుండగులు ధ్వంసం చేశారు.
డేబ్రా నియోజకవర్గం భాజపా మండల అధ్యక్షుడు మోహన్ సింగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దేబ్రా భాజపా అభ్యర్థి భారతీ ఘోష్.. ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారని తృణమూల్ ఆరోపించింది.
బంగాల్లో మొత్తం రెండో దశలో 30 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 171 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
నందిగ్రామ్‌లో సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ, భాజపా అభ్యర్థి సువేందు అధికారి మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది.
ఇదీ చదవండి: నందిగ్రామ్ రణం: రోజంతా వార్ రూమ్‌లోనే దీదీ!