Real Estate Businessman Murder: కర్ణాటకలోని బెళగావిలో ఇటీవల వెలుగు చూసిన స్థిరాస్తి వ్యాపారి హత్య కేసులో విస్తుపోయే విషయాలు వెల్లడయ్యాయి. ప్రేమించి పెళ్లాడిన రెండో భార్యే రాజు మలప్ప దొడ్డబణ్నవర్ హత్యకు పథకం పన్నినట్లు దర్యాప్తులో తేలింది. రాజు వ్యాపార భాగస్వాముల సాయంతో ఈ దారుణానికి పాల్పడింది. నిందితురాలు కిరణ సహా మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇదీ జరిగింది : రాజు మలప్ప దొడ్డబణ్నవర్(46) అనే స్థిరాస్తి వ్యాపారికి ముగ్గురు భార్యలు. 22 ఏళ్ల క్రితం ఉమ అనే మహిళను వివాహం చేసుకోగా వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం వారు వైద్య విద్యనభ్యసిస్తున్నారు. 8 ఏళ్ల క్రితం మహారాష్ట్రలోని లాథూర్‌లో నిందితురాలు కిరణను కూడా వివాహం చేసుకున్నాడు. వీరికి కూడా ఇద్దరు సంతానం. ఈ విషయం తెలుసుకుని.. నాలుగేళ్ల క్రితం భర్త, పిల్లలను వదిలేసి బెంగళూరు వెళ్లి ఒంటరిగా జీవిస్తోంది మొదటి భార్య ఉమ. తర్వాత.. హలియాల్ తాలూకాకు చెందిన దీపాలీని వివాహం చేసుకున్నాడు రాజు. ఆమె ప్రస్తుతం మూడు నెలల గర్భిణీ.
అయితే.. రెండో భార్య కిరణను వివాహం చేసుకునే సమయానికే మరొకరితో తనకు పెళ్లి జరిగినట్లు రాజు ఆమెకు చెప్పలేదు. దానికి తోడు కొంతకాలం తర్వాత అతను మరో వివాహం చేసుకున్నాడు. భర్తపై కోపం పెంచుకున్న కిరణ.. కక్ష సాధించాలనుకుంది. మరోవైపు రాజుకు వ్యాపార భాగస్వాములైన ధర్మేంద్ర, శశికాంత్‌తో ఇటీవల గొడవ జరిగింది. దీంతో కిరణ.. ధర్మేంద్ర, శశికాంత్‌తో కలిసి రాజు హత్యకు కుట్ర పన్నింది. ఈ క్రమంలో జయకర్ణాటక సంస్థ జిల్లా అధ్యక్షుడు సంజయ్ రాజ్‌పుత్‌ను సంప్రదించి రూ.10 లక్షల సుపారీ ఇచ్చింది. విజయ్ జగ్రిత్ అనే మరో వ్యక్తికి ఈ సొమ్ము అందించాడు సంజయ్.
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భార్యను కలిసేందుకు ఈనెల 15న ఉదయం కారులో వెళ్లిన రాజును పలువురు దుండగులు అడ్డగించి, దారుణంగా పొడిచి చంపేశారు. శరీరంపై పదునైన ఆయుధంతో 16 సార్లు దాడి చేయడం వల్ల తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం దుండగులు పరారయ్యారు. రాజు వ్యాపార భాగస్వాముల ఫోన్ కాల్స్ విశ్లేషించగా అసలు విషయం బయటపడింది. ప్రధాన నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు.. పరారీలో ఉన్న మిగతా వారి కోసం గాలిస్తున్నారు.
ఇదీ చూడండి : విషపు చాక్లెట్లు ఎర వేసి.. నలుగురు చిన్నారుల్ని బలిగొని...