కరోనా కట్టడికి ప్రధాన ఆయుధమైన మాస్కును వాడిన వెంటనే మూత ఉన్న చెత్తడబ్బాలో వేయాలనేది నిపుణుల సూచన. అవన్నీ మాకెందుకు, వాటితోనూ మేం వ్యాపారం చేస్తామంటోంది ఓ పరుపుల తయారీ సంస్థ. అందుకే పరుపులను నింపేందుకు పత్తికి బదులు.. వాడిన మాస్కులను వినియోగిస్తోంది. మహారాష్ట్రలోని జల్‌గావ్ జిల్లాలో పారిశ్రామిక వాడలోని ఓ సంస్థ నిర్వాకమిది. ఈ వ్యవహారంపై సమాచారం అందుకున్న పోలీసులు సంస్థపై దాడి చేసి, యజమానిపై కేసు నమోదు చేశారు.
'పారిశ్రామికవాడలోని ఓ సంస్థలో వాడిన మాస్కులను పరుపుల్లో కూర్చడానికి ఉపయోగిస్తున్నట్లు సమాచారం అందింది. అధికారులు దాడి చేసినప్పుడు ఈ విషయం బయటపడింది' అని అదనపు ఎస్పీ చంద్రకాంత్ గవాలీ మీడియాకు వెల్లడించారు. అలాగే సదరు సంస్థ యజమాని అజ్మద్ అహ్మద్ మన్సూరీపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు చెప్పారు.
నిబంధల ప్రకారం గుట్టలుగా పడి ఉన్న వాడిన మాస్కులను కాల్చివేసిట్లు తెలుస్తోంది.
భారీగా వ్యర్థాలు
కరోనా కారణంగా భారత్‌లో మాస్కుల ఉత్పత్తి, వాడకం భారీగా పెరిగింది. దాంతో మన దేశంలో వైరస్ నుంచి రక్షణ కోసం వాడుతున్న తొడుగుల వ్యర్థాల నిర్వహణ సవాలుగా మారింది. 2020 జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో 18వేల టన్నుల బయో మెడికల్ వ్యర్థాలు(మాస్క్‌లు, గ్లౌజులు తదితరాలు) పేరుకుపోయినట్లు కాలుష్య నియంత్రణ మండలి గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
మరోవైపు, భారత్‌ను రెండో దశ తీవ్రంగా వేధిస్తోంది. తాజాగా 1,68,912 కొత్త కేసులు నమోదు కాగా..904 మంది మృత్యుఒడికి చేరుకున్నారు.
ఇదీ చదవండి: పిడుగుపాటుకు చిచ్చుబుడ్డిలా నిప్పులు చిమ్మిన చెట్టు