ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప దర్శనానికి విమానంలో వెళ్లే భక్తులకు ప్రత్యేక వెసులుబాటును కల్పించింది బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్. భక్తులు సంప్రదాయంగా పట్టుకెళ్లే ఇరుముడిని క్యాబిన్ లగేజీలో తీసుకువెళ్లేందుకు అనుమతించింది. అన్ని తనిఖీల తర్వాతే.. అయ్యప్ప భక్తులు తీసుకెళ్లే ఇరుముడిని క్యాబిన్‌లోకి అనుమతించాలని అన్ని విమానాశ్రయాల భద్రతా సిబ్బందికి మార్గదర్శకాలు ఇచ్చింది. వచ్చే ఏడాది జనవరి 20 వరకు విమానాల్లో శబరిమల వెళ్లే భక్తులకు వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మండలం, మకరజ్యోతి దీక్షలు పూర్తయ్యే వరకు మాత్రమే ఈ అవకాశం ఉంటుందని స్పష్టం చేసింది. అంతకుముందు విమాన ప్రయాణాల్లో ఇరుముడిని తీసుకువెళ్లడానికి అనుమతి ఇచ్చేవారు కాదు. ప్రస్తుతం ఇచ్చిన వెసులుబాటుతో అనేక మంది భక్తులకు శబరిమల ప్రయాణం సులభం కానుంది.
మండల పూజల కోసం శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం నవంబర్ 16న తెరుచుకుంది. ఆలయ ప్రధాన అర్చకుడు ఎన్ పరమేశ్వరన్ నంబూదిరి ఆధ్వర్యంలో సాయంత్రం 5గంటలకు ఆలయాన్ని తెరిచారు. కరోనా సంబంధిత ఆంక్షలను ఉపసంహరించిన తర్వాత జరుగుతున్న తొలి మండల పూజ ఇదే కావడం విశేషం. 41రోజుల పాటు జరిగే మండల పూజ డిసెంబర్ 27న ముగుస్తుంది. మధ్యలో విరామం ఇచ్చి డిసెంబర్ 30న మకరజ్యోతి కోసం ఆలయాన్ని మళ్లీ తెరుస్తారు.
అయ్యప్ప మాల వేసుకునే భక్తులు సంప్రదాయం ప్రకారం ఇరుముడిని కడతారు. నెయ్యితో నింపిన కొబ్బరికాయని దేవుడికి సమర్పించేందుకు శబరిమల తీసుకువెళతారు. అలా ఇరుముడిని కట్టిన భక్తులకు మాత్రమే పవిత్రమైన 18 మెట్లను ఎక్కే అవకాశాన్ని కల్పిస్తారు. మిగిలిన భక్తులను ప్రత్యేక మార్గంలో దర్శనానికి అనుమతిస్తారు.
దర్శన సమయాన్ని పొడగించిన బోర్డు
మండల దీక్షలో భాగంగా శబరిమల అయ్యప్ప దేవస్థానానికి భక్తులు తాకిడి ఎక్కువైంది. దీంతో దర్శన సమయాన్ని పెంచింది శబరిమల అయ్యప్ప దేవస్థాన బోర్డు. మధ్యాహ్నం 4 గంటలకు బదులు 3 గంటలకే ఆలయాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది. ఇంతకుముందు ఉదయం 3 నుంచి ఒంటి గంట వరకు.. తిరిగి మధ్యాహ్నం 4 గంటల నుంచి అర్ధరాత్రి వరకు దర్శనానికి అనుమతి ఇచ్చేది బోర్డు. సోమవారం ఒక్కరోజే 70,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని ఆలయ అధికారులు తెలిపారు.
ఇవీ చదవండి: శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళ్తున్నారా? అయితే ఇది మీకోసమే!
తెరుచుకున్న శబరిమల ఆలయం.. 41రోజుల పాటు మండల పూజ.. భారీగా భక్తుల తాకిడి!