నలుగురు జవాన్ల మృతికి కారణమైన పంజాబ్ బఠిండాలోని సైనిక కేంద్రంలో జరిగిన కాల్పుల ఘటనలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సివిల్ దుస్తుల్లో ఉన్న ఇద్దరు వ్యక్తులు ఈ కాల్పులకు పాల్పడినట్లు బఠిండా ఎస్పీ అజయ్ గాంధీ వెల్లడించారు. మాస్క్‌లు ధరించి ఈ దారుణానికి తెగబడినట్లు పేర్కొన్నారు. కుర్తా పైజామా ధరించిన ఇద్దరు వ్యక్తులు దాడికి పాల్పడినట్లు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ తర్వాత వారు దగ్గర్లోని అడవిలోకి పారిపోయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. మీడియాలో వచ్చిన కథనాలను బట్టి ఓ అనుమానితుడిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు.
ఘటన జరిగిన ప్రదేశంలో సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. కాల్పులు ఎవరు జరిపారో ఇంకా స్పష్టత లేదని పోలీసులు తెలిపారు. ఒకరి చేతిలో ఇన్సాస్ రైఫిల్, మరొకరి చేతిలో గొడ్డలి ఉన్నట్లు సమాచారం. 22 రౌండ్ల తూటాలతో సహా రెండు రోజుల క్రితం కనిపించకుండా పోయిన ఇన్సాస్ రైఫిల్ అంశం దీనికి కారణమా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు సైన్యం పేర్కొంది. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు భద్రతా బలగాలు ఎవ్వరినీ అదుపులోకి తీసుకోలేదు.
తెల్లవారుజామున 4.35 గంటలకు ఈ ఘటన జరిగింది. కాల్పుల్లో నలుగురు ఆర్మీ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన నలుగురు సైనికుల వయసు 20 నుంచి 30 మధ్యే ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. ఆ సమయంలో వారంతా నిద్రలో ఉన్నారని పేర్కొన్నారు. మృతుల్లో ఇద్దరిది కర్ణాటక కాగా.. మరో ఇద్దరిది తమిళనాడు అని తెలిపారు. మృతుల బంధువులకు ఈ సమాచారాన్ని అందించామని చెప్పారు.
- మృతుల వివరాలు
- ఎంటీ సంతోష్ నాగ్రా, డ్రైవర్
- ఎంటీ కమలేశ్, డ్రైవర్
- ఎంటీ సాగర్ బన్నె, డ్రైవర్
- యోగేశ్ కుమార్, గన్నర్
తుపాకీ కాల్పుల శబ్దాలు వినిపించగానే.. స్టేషన్‌లోని అత్యవసర ప్రతిస్పందన బృందాలు అలర్ట్ అయ్యాయి. ఆగంతుకులపై ఎదురు కాల్పులు జరిపాయి. దీంతో నిందితులు అక్కడి నుంచి పరార్ అయినట్లు సమాచారం. వెంటనే చర్యలు చేపట్టిన అధికారులు.. సైనిక శిబిరాన్ని మూసేశారు. శిబిరంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు.
మృతి చెందిన నలుగురు కాకుండా.. మిలిటరీ స్టేషన్లో ఉన్న ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని సైన్యానికి చెందిన సౌత్ వెస్ట్రన్ కమాండ్ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఆస్తినష్టం కూడా జరగలేదని పేర్కొంది. ఈ ఘటన తీవ్రవాద దాడి కాదని పంజాబ్ అడిషనల్ డీజీపీ ఎస్పీఎస్ పార్మర్ వెల్లడించారు. సైన్యం, పంజాబ్ పోలీసులు ఈ ఘటనపై సంయుక్తంగా దర్యాప్తు చేస్తున్నారు. ఆ ప్రాంతంలో నిర్బంధం కొనసాగుతుందని సైన్యం తెలిపింది. ఈ ఘటనకు సంబంధించి ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌కు వివరాలు తెలిపారు.