Arrest warrants against farmers: రుణాలు తీసుకున్న రైతులపై చర్యలు చేపట్టింది పంజాబ్‌లోని భగవంత్ మాన్ ప్రభుత్వం. వ్యవసాయ అభివృద్ధి బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని తిరిగి చెల్లించని రైతులకు అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2000 మంది రైతులపై ఈ అరెస్ట్ వారెంట్లు జారీ అయ్యాయి. ఇందులో కొందరికి కొత్తగా జారీ చేయగా, మరికొందరి వారెంట్లును రెండోసారి జారీ చేశారు. రైతుల నుంచి రూ.3200 కోట్లు వసూలు చేయనున్నట్లు సమాచారం.
రైతులపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించిన నేపథ్యంలో ఆందోళనకు దిగేందుకు కర్షకులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి చర్యలు కొనసాగితే తగినవిధంగా స్పందిస్తామని హెచ్చరించారు పలువురు రైతులు. ఈ విషయంపై ప్రభుత్వ ఉన్నతాధికారులు స్పందించలేదు. రుణాల వసూలులో భాగంగా ఫిరోజ్‌పుర్ రైతులపై చర్యలు చేపట్టింది ప్రభుత్వం. ఇందులో బస్తి రామ్వారాకు చెందిన బఖ్షిష్ సింగ్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే.. తాను నెలరోజుల్లోపు రుణాలు చెల్లిస్తానని హామీ ఇవ్వటం వల్ల విడిచిపెట్టారు. ఒక్క ఫిరోజ్‌పుర్ జిల్లాలోనే 250 మంది కర్షకులపై అరెస్ట్ వారెంట్ జారీ అయినట్లు సమాచారం.
బ్యాంకు అధికారులు చెబుతున్నదేమిటి?: ప్రభుత్వం రుణ మాఫీ చేస్తుందనే కారణంగానే రైతులు తాము తీసుకున్న లోన్ తిరిగి చెల్లించటం లేదన్నారు వ్యవసాయ అభివృద్ధి బ్యాంక్ ఛైర్మన్ బల్వీర్ సింగ్. రైతులు రుణాలు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నారని, అయితే, వడ్డీ చెల్లించలేమని చెబుతున్నారని పేర్కొన్నారు. రైతుల నుంచి రుణాలను తిరిగి వసూలు చేసుకోవటం బ్యాంకుల బాధ్యత అని తెలిపారు.
- మొత్తంగా పంజాబ్ రాష్ట్రవ్యాప్తంగా 60,000 రైతులను రుణ ఎగవేతదారులుగా ప్రకటించారు. బ్యాంకులకు బాకీపడిన రుణాలు మొత్తం రూ.2300 కోట్లుగా సమాచారం.
- రైతుల నుంచి ఇప్పటి వరకు రూ.1150 కోట్లు వసూలైనట్లు అధికారవర్గాలు తెలిపాయి. గత సీజన్లో కేవలం రూ.200 కోట్లు రికవరీ చేయగలిగాయి బ్యాంకులు.
- ఫిరోజ్‌పుర్ జిల్లాలో 250, గురు హర్సహాయ్లో 200, జలాలాబాద్‌లో 400, ఫజిల్కాలో 200, మన్సా జిల్లాలో 200 మంది రైతులపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది.
ఇదీ చూడండి: పేదల పాలిట 'జ్ఞాన వృక్షం'.. ఫ్రీగా ఐఐటీ కోచింగ్.. ఇప్పటికే 150 మందికి సీట్లు!
భారత్‌కు బ్రిటన్ ప్రధాని.. 100కోట్ల పౌండ్ల ఒప్పందాలు.. 11 వేల ఉద్యోగాలు!