మహారాష్ట్ర అహ్మద్‌నగర్ జిల్లాలోని సాయిబాబా ప్రముఖ క్షేత్రం షిర్డీ ఆలయానికి నిత్యం వేలాదిగా భక్తులు వస్తుంటారు. ఎవరి స్తోమతకు తగ్గట్టు వారు ఆలయం హుండీలలో మొక్కులు సమర్పిస్తుంటారు. కొందరు కరెన్సీ నోట్లను సమర్పిస్తే మరికొందరు చిల్లర నాణేలను కానుకలుగా ఇస్తుంటారు. ఈ నాణేలే ఇప్పుడు కొన్ని బ్యాంకులకు ఇబ్బందిగా మారాయి.
సాయిబాబా సంస్థాన్.. షిర్డీ సాయిబాబా ఆలయాన్ని నిర్వహించే ట్రస్టు. రోజూ ఆలయంలోని హుండీల్లో వచ్చే కానుకలను సంస్థాన్‌లోని సభ్యులే లెక్కిస్తారు. భక్తులు హుండీల్లో వేసే నాణేలతో ఆలయానికి ఏటా కొట్లల్లో ఆదాయం వస్తుంది. ఇలా లెక్కించిన కరెన్సీ నోట్లను, నాణేలను ఆలయం పేరిట ఉన్న సంబంధిత బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. దీంతో షిర్డీ సాయిబాబా సంస్థాన్ ఖాతాలు ఉన్న బ్యాంకులు విరాళంగా వచ్చే నాణేల నిల్వలతో నిండిపోయాయి. ఈ కారణంగా నాలుగు బ్యాంకులు సంస్థాన్ నుంచి నాణేలను డిపాజిట్ చేసుకునేందుకు ససేమిరా అంటున్నాయి. దీంతో అహ్మద్‌నగర్ జిల్లాలోని మరో బ్యాంకులో ఖాతా తెరిచేందుకు సిద్ధమైంది సాయి సంస్థాన్.
మూడు ట్రక్కుల నిండా నాణేలు..!
ఇప్పటివరకు జిల్లాలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ పచేగావ్, ఔరంగాబాద్‌లోని కెనరా బ్యాంకుల్లో ఆలయం కానుకలను డిపాజిట్ చేస్తు వస్తోంది సాయి ట్రస్ట్. సాయి సంస్థాన్‌కు షిర్డీలోనే 10కి పైగా బ్యాంకులతో పాటు నాసిక్‌లోని ఓ జాతీయ బ్యాంకులో ఖాతాలు ఉన్నాయి. మొత్తంగా షిర్డీ సాయిబాబా సంస్థాన్ పేరుపై రూ.2600 కోట్లు డిపాజిట్ల రూపంలో ఉన్నాయి. సాయి సంస్థాన్ వారానికి రెండుసార్లు హుండీల్లో వచ్చిన విరాళాలను లెక్కపెడుతుంది. ఈ మొత్తాన్ని బ్యాంకుల్లో జమ చేస్తారు. ప్రస్తుతం ఒక్కో బ్యాంకు వద్ద సగటున ఒకటిన్నర నుంచి రెండు కోట్ల నాణేలు ఉన్నాయి. దీంతో బ్యాంకుల్లో నాణేలను నిల్వ చేసేందుకు స్థలం కూడా లేకుండా పోయింది. షిర్డీలోని ఛత్రపతి కాంప్లెక్స్ మొదటి అంతస్తులో ఉన్న కెనరా బ్యాంక్‌లోని స్ట్రాంగ్‌రూమ్ ఇప్పటికే నాణేలతో నిండిపోయింది. ఇందులో ఉన్న నాణేలు కనీసం మూడు ట్రక్కుల నిండా ఉంటాయని అధికారులు చెబుతున్నారు. వీటి బరువు కారణంగా పైకప్పు కూలిపోతుందేమోనని బ్యాంకు కింద ఉన్న దుకాణదారులు భయాందోళనకు గురవుతున్నారు.
ఈ నాణేలన్నీ బ్యాంకుల్లోనే ఖాళీగా పడి ఉంటున్నప్పటికీ.. వడ్డీ రూపంలో సాయి సంస్థాన్‌కు కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకోసం ఏటా రూ.15 నుంచి రూ.20 లక్షల రూపాయలను ఖర్చు చేస్తున్నాయి బ్యాంకులు. వీటిని భద్రపరిచేందుకు వినియోగించే సంచుల కొనుగోలు ఖర్చులు కూడా బ్యాంకులే భరించాల్సి ఉంటుంది.
సాయిబాబా ఆలయానికి ఎక్కువగా దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులే పెద్ద మొత్తంలో చిల్లర నాణేలను కానుకలుగా హుండీలో వేస్తారు. ఈ నాణేలను లెక్కించేందుకు సాయిబాబా సంస్థాన్ స్వయంగా బ్యాంకులను కౌంటింగ్ యంత్రాలను విరాళంగా అడిగింది. ఈ నాణేల సమస్యపై షిర్డీలోని అన్ని బ్యాంకులు ఏకమై పోరాటం కూడా చేయటం గమనార్హం.
కస్టమర్ల నుంచి నాణేలను స్వీకరించమని ఆర్బీఐ అన్ని బ్యాంకులను ఆదేశించడం వల్ల ఈ సమస్య మరితం జఠిలమైంది. వీలైనంత త్వరగా బ్యాంకుల నుంచి ఈ నాణేలను ఆర్బీఐ స్వీకరిస్తే తప్ప ఈ సమస్యకు పరిష్కారం దొరకదని భావిస్తున్నారు బ్యాంకు యజమానులు. బ్యాంకుల్లో నాణేల సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సాయిబాబా సంస్థాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాహుల్ జాదవ్ తెలిపారు.