Bajrang Dal Activist Murder: భజరంగ్‌దళ్ కార్యకర్త హర్ష హత్య కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేసినట్లు కర్ణాటక హోంశాఖ మంత్రి అరాగ జ్ఞానేంద్ర వెల్లడించారు. ఈ కేసులో ఐదుగురు వ్యక్తులను నిందితులుగా అనుమానిస్తున్నామని, ఈ హత్య వెనుక అసలు కారణాలు తెలియాల్సి ఉందని పేర్కొన్నారు.
"ఐదుగురు అనుమానితుల్లో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. విచారణ తరువాత అసలు నిజాలు తెలుస్తాయి. శివమొగ్గలో మొత్తం 1200 మంది పోలీసులను మోహరించాం. 200 మంది పోలీసులను బెంగళూరు నుంచి తరలించాం. ఏడీజీపీ మురుగన్ అంశాలను పర్యవేక్షిస్తున్నారు. శాంతిభద్రతలు సాధారణ స్థితికి చేరుకుంటాయి."
-- అరాగ జ్ఞానేంద్ర, కర్ణాటక హోంశాఖ మంత్రి
2 లక్షలు పరిహారం..
భజరంగ్‌దళ్ కార్యకర్త హర్ష కుటుంబానికి భాజపా ఎమ్మెల్యే ఎంపీ రేణుకాచార్య రూ. 2 లక్షల పరిహారం ప్రకటించారు. జిల్లాలో ఎలాంటి ఉద్రిక్తపరిస్థితులు తలెత్తకుండా మంగళవారం ఉదయం వరకు శివమొగ్గలో కర్ఫ్యూ విధించాలని పోలీసులు జిల్లా కలెక్టర్‌ను కోరారు.
శివమొగ్గకు చెందిన భజరంగ్‌దళ్ కార్యకర్త హర్ష (23) హర్షను ఆదివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి హత్య చేశారు. అయితే రాష్ట్రంలో హిజాబ్ వివాదం నడుస్తోన్న వేళ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. సోమవారం ఉదయం మృతుడి కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళన చేపట్టగా.. కొందరు భజరంగ్ దళ్ కార్యకర్తలు మద్దతు పలికారు. రోడ్లపై ర్యాలీలు చేపట్టి నిరసన తెలియజేశారు.
కొన్ని చోట్ల ఆందోళనకారులు టైర్లు, వాహనాలు దహనం చేశారు. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో శివమొగ్గలో నిషేధాజ్ఞలు జారీ చేశారు. రెండురోజులపాటు పాఠశాలలకు సెలవు ప్రకటించారు.
ఇదీ చూడండి: భజరంగ్‌దళ్ కార్యకర్త అంత్యక్రియల్లో అల్లరిమూకల విధ్వంసం