లాక్‌డౌన్‌తో ఎలాంటి గిరాకీ లేక కన్నీరు పెట్టుకుని యావత్ దేశం దృష్టిలో పడిన 'బాబా కా దాబా' (baba ka dhaba) యజమాని కాంతా ప్రసాద్.. ఆత్మహత్యాయత్నం చేశారు. ప్రస్తుతం ఆయన దిల్లీలోని సఫ్దార్జంగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆల్కహాల్ సేవించి నిద్ర మాత్రలు మింగిన ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లగా.. గురువారం రాత్రి కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు ఆయన కుమారుడి నుంచి వాంగ్మూలం తీసుకున్నట్లు వెల్లడించారు.
అయితే కాంతా ప్రసాద్ ఆత్యహత్యకు ప్రయత్నించడానికి గల కారణాన్ని మాత్రం పోలీసులు వెల్లడించలేదు.
2020లో కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్‌తో తన దాబాకు(baba ka dhaba) గిరాకీ లేక ఇబ్బందులు పడిన కాంతా ప్రసాద్ వీడియోను ఓ యూట్యూబర్ పోస్ట్ చేయగా లక్షల మంది చూశారు. అనేక మంది దాతలు సాయం చేశారు. దాంతో మాలవియా నగర్లో ఓ కొత్త రెస్టారెంట్‌ను ప్రారంభించారు కాంతా ప్రసాద్. అయితే.. కరోనా రెండో దశ ఉద్ధృతి కారణంగా అది కూడా నష్టాల్లోకి వెళ్లగా.. మళ్లీ తిరిగి తన పాత దాబాకే వచ్చారు. ఇక్కడైతే నిర్వహణ ఖర్చు ఉండదని, లాభం ఎక్కువగా ఉంటుందని చెప్పారు.
ఆత్మహత్య పరిష్కారం కాదని చెప్పి..
గతంలో ఈటీవీ భారత్‌తో ఇంటర్వ్యూ సందర్భంగా అత్మహత్య సమస్యలకు పరిష్కారం కాదని చెప్పిన కాంతా ప్రసాద్.. ఇప్పుడు అలాంటి చర్యకే పాల్పడటం బాధాకరం. సామాజిక మాధ్యమాల్లో తన వీడియో వైరల్ కావడానికి ముందు దాబాలో రోజుకు 750 గ్రాముల రైస్ అమ్మడానికే ఇబ్బందిపడ్డానని, కానీ ఆ తర్వాత రోజుకు 5 కేజీల రైస్ విక్రయిస్తున్నట్లు ఆయన ఓ సందర్భంలో చెప్పారు. కష్టాలు ఎదురైతే వాటిని అధిగమించడాని పోరాడాలే తప్ప ఆత్మహత్య చేసుకోవడం పరిష్కారం కాదని అప్పుడు అన్నారు.
'చివరి శ్వాస వరకు దాబా నడుపుతా'
తన చివరి శ్వాస వరకు బాబా కా దాబా నడుపుతానని కాంతా ప్రసాద్ గతంలో చెప్పారు. వచ్చిన విరాళాల్లో తనతో పాటు, తన భార్య భవిష్యత్ అవసరాల కోసం రూ.20లక్షలను దాచిపెట్టుకున్నట్లు పేర్కొన్నారు. ఒక్కరు కూడా రాని పరిస్థితి వస్తే తప్ప తన దాబాను మూసివేయబోనని స్పష్టం చేశారు.
యూట్యూబర్‌కు క్షమాపణలు..
సామాజిక మధ్యమాల్లో తనను పాపులర్ చేసిన యూట్యూబర్ గౌరవ్ వాసన్పైనే కాంతా ప్రసాద్ ఆరోపణలు గుప్పించారు. తనకు వచ్చిన విరాళాల్లో అవకతవకలు జరిగాయన్నారు. రెస్టారెంట్ మూసి పాత దాబాకు తిరిగివచ్చిన తర్వాత ఆయనకు క్షమాపణలు చెప్పారు. దీన్ని గౌరవ్ కూడా అంగీకరించారు.