రాజకీయవేత్త, పారిశ్రామికవేత్త, విద్యావేత్త, రచయిత.. ఇలా ఆయన లేని రంగం లేదు. భారతీయ బహుళత్వాన్ని నరనరానా జీర్ణించుకొని, బానిసల్లా బతుకుతున్న భారతీయుల్లో స్వరాజ్య కాంక్ష విత్తనం నాటిన తొలితరం జాతీయోద్యమ నేత దాదాభాయ్ నౌరోజీ(Dadabhai Naoroji)! అంతేకాదు భారత్‌లో మొదటితరం పారిశ్రామికవేత్త కూడా! భారత పారిశ్రామిక పితామహుడిగా పేరొందిన జేఆర్‌డీ టాటాలాంటివారికీ మార్గదర్శకులు. గుజరాత్‌లోని నవసారిలోని పార్శీ కుటుంబంలో 1825 సెప్టెంబరు 4న జన్మించిన నౌరోజీ ముంబయి ఎల్ఫిన్‌స్టోన్ విద్యాలయంలో చదివి అక్కడే గణితం, తత్వశాస్త్ర ఆచార్యుడిగా నియమితులయ్యారు.
బ్రిటన్‌లో భారతీయ కంపెనీ
ఒకవంక విద్యారంగంలో కొనసాగుతూనే వాణిజ్యంలోకీ అడుగుపెట్టారు. 1855లోనే బ్రిటన్ వెళ్లి భాగస్వామ్యంలో కామా అండ్ కంపెనీని ఆరంభించారు. ఆ కాలంలో బ్రిటన్‌లో తొలి భారతీయ కంపెనీ అది! కానీ ఆ కంపెనీ నల్లమందు, మద్యం వ్యాపారంతో ముడిపడటంతో దాన్నుంచి బయటకు వచ్చారు. 1859లో తానే సొంతంగా దాదాభాయ్ నౌరోజీ కాటన్ ట్రేడింగ్ కంపెనీ ఆరంభించారు. అది నడుపుతుండగానే లండన్ యూనివర్సిటీ కాలేజీలో గుజరాతీ ప్రొఫెసర్‌గా నియమితులయ్యారు.
రాజకీయాలు, భారతీయ సంస్కృతి, సాహిత్యంపై చర్చించేందుకు లండన్ ఇండియన్ సొసైటీని ఆరంభించారు. భారతీయులు పడుతున్న కష్టనష్టాల గురించి తెలియటానికి ఈస్టిండియా అసోసియేషన్ ఏర్పాటు చేశారు. తద్వారా బ్రిటిష్ పార్లమెంటుపై ఒత్తిడి పెంచాలనేది ఆయన ఎత్తుగడ. నౌరోజీ వివిధ సంఘాలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చి 1885లో భారత జాతీయ కాంగ్రెస్ స్థాపనలో కీలకపాత్ర పోషించారు. మూడుసార్లు దానికి అధ్యక్షుడిగా వ్యవహరించారు.
పార్లమెంటులో భారత గళం
1892లో మళ్ళీ లండన్ వెళ్లి అక్కడ లిబరల్ పార్టీ తరఫున పార్లమెంటుకు ఎన్నికయ్యారు. బ్రిటన్ పార్లమెంటుకు ఎన్నికైన తొలి భారతీయుడాయనే! పార్లమెంటులో భారత పరిస్థితిని వివరిస్తూ పాలనలో వారికీ భాగస్వామ్యం కల్పించాలని, స్వయంప్రతిపత్తి ఇవ్వాలని డిమాండ్ చేశారు. భారత్ నుంచి బ్రిటన్ ఎలా దోచుకుపోతోందో, భారత్‌నెలా దివాలా తీయిస్తోందో 1901లోనే పుస్తకం వేసి మరీ లోకానికి చాటారు. ఆయన ప్రయత్నాల ఫలితంగానే భారత్‌లో పాలనాపరమైన సంస్కరణలను బ్రిటిష్ ప్రభుత్వం మొదలెట్టింది. కాంగ్రెస్‌లో అతివాదులు, మితవాదులందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తిగా ఎదిగిన నౌరోజీ అందరినీ స్వరాజ్యం దిశగా నడిపించారు. బాలగంగాధర్ తిలక్, గోపాల కృష్ణ గోఖలేలకు కూడా గురుతుల్యుడయ్యారు. 1917లో 91వ ఏట ముంబయిలో మరణించిన బహుముఖ ప్రజ్ఞాశాలి నౌరోజీ వేసిన బాటలోనే ఆ తర్వాత జాతీయోద్యమం ముందుకు సాగింది. "ఏదైనా సమస్య వస్తే తండ్రివైపు పిల్లలెలా చూస్తారో మీవైపు యావత్ భారతావని చూసింది" అని ఆయన గురించి గాంధీజీ రాశారు!
ఇవీ చదవండి: