Azadi Ka Amrit Mahotsav: బెంగాలీ రచయితైనా ... తెలుగునాటే కాక యావద్దేశంలో మారుమోగిన పేరు శరత్! 1876లో జన్మించిన శరత్‌చంద్ర ఛటోపాధ్యాయ బాల్యం పేదరికంలో గడిచింది. చదువుల్లో చురుకైనా ఫీజులు కట్టే స్థోమత లేక ఉన్నత చదువులకు పోలేక... కుటుంబ పోషణార్థం రంగూన్‌లో ఉద్యోగంలో చేరాల్సి వచ్చింది. మొదట్లో మారుపేర్లతో ఆయన రాసిన కథలు చదివి బెంగాల్ అంతా ఆశ్చర్యపోయింది. బంకించంద్ర ఛటర్జీ తర్వాత ఇంత ప్రభావవంతంగా రాస్తున్నది... తప్పకుండా రవీంద్రనాథ్ ఠాగూరే అయ్యుంటారనుకుంది. ఠాగూర్ తాను కాదని చెప్పేశారు. అసలు రచయిత బయటపడగానే ... ఉన్నపళంగా బెంగాల్‌లో ప్రముఖుడయ్యారు శరత్! ముఖ్యంగా బెంగాలీ మధ్యతరగతికి హీరో అయ్యారు. బ్రిటిష్ సర్కారు దాష్టీకాలతో పాటు అప్పటి భారత సమాజంలోని అంటరానితనం, అసమానత, ఆధిపత్య ధోరణిలాంటి అనేక అవలక్షణాలనూ ఏమాత్రం ఉపేక్షించకుండా తన రచనల్లో ఏకిపారేసేవారాయన. ఇవన్నీ పాఠకులను ఉత్తేజపరిచేవి. ఎంతగా అంటే... స్వాతంత్య్ర సమరయోధుడు దేశబంధు చిత్తరంజన్‌దాస్ తన పత్రిక నారాయణ్ కోసం శరత్ రాసిన స్వామి అనే కథను చూసి పరవశులైపోయారు. దీనికి వెలకట్టే స్థాయి నాకు లేదంటూ... తన ఇష్టం వచ్చినంత సొమ్ము తీసుకోండని సంతకం పెట్టి శరత్‌కు ఖాళీ చెక్ ఇచ్చారు.
అరుదైన కథాశిల్పి శరత్ నుంచి వెలువడ్డ ‘పథేర్ దబి’ బెంగాలీ నవల సంచలనం రేకెత్తించటమేగాకుండా ఆయన్ను ఇబ్బందుల్లో పడేసింది. 1922 నుంచి 1926 దాకా బంగవాణి మాసపత్రికలో సీరియల్‌గా ఇది ప్రచురితమైంది. నవలలో పథేర్ దబి అనేది ఓ విప్లవవాద సంస్థ పేరు. ఆంగ్లేయుల బానిసత్వం నుంచి భారతావనిని విముక్తి చేయటం దీని లక్ష్యం. సంబంధాలంటే కేవలం కుటుంబ సంబంధాలే కాదని... భారత స్వాతంత్య్రం కోసం పోరాడుతున్నవారంతా కూడా కుటుంబ సభ్యులే అన్నట్లుగా ప్రజలను చైతన్యం చేస్తుందీ నవల. ఈ రచనలో ప్రభుత్వ వ్యతిరేకతను గుర్తించిన బ్రిటిష్ సర్కారు... మునుముందు పుస్తకంగా వేయకుండా నిషేధం విధించి, రచయిత, ముద్రణదారుపై కేసు పెడదామని నిర్ణయించుకుంది. మేగజీన్లో ఆఖరి అంకం కోసం వేచిచూడసాగింది. ఈ విషయం పత్రిక పబ్లిషర్ రామ్‌ప్రసాద్ ముఖర్జీకి తెలిసింది. అంతా కలసి ఓ ఎత్తుగడ వేశారు. సీరియల్ పూర్తయినా కూడా ‘సశేషం’ అని ప్రచురించారు. అలా ఇంకా ఉందనే భ్రమలో ఆంగ్లేయ సర్కారును ఉంచి... మరోవైపు పుస్తకం రూపంలో ముద్రించటానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అంతకుముందే ఈ నవలను ముద్రించటానికి ముందుకు వచ్చి శరత్‌కు వెయ్యి రూపాయలు ముందస్తుగా ఇచ్చేసిన సంస్థ ప్రభుత్వానికి భయపడి వెనక్కి తగ్గింది. ఎవ్వరూ ముందుకు రాకపోవటంతో... మేగజీన్ పబ్లిషర్ రామ్‌ప్రసాద్ ముఖర్జీయే నడుం బిగించారు. కేసుల భారం, ఖర్చు తానే భరిస్తాననని రామ్ ప్రసాద్ హామీ ఇవ్వటంతో కాటన్ ప్రెస్ అంగీకరించింది. చకచకా నవలను 5వేల కాపీలు ముద్రించి మార్కెట్లోకి తీసుకొచ్చారు. వారం రోజుల్లో అన్నీ అమ్ముడైపోయాయి. ఆలస్యంగా విషయం తెలిసిన ఆంగ్లేయ పోలీసులు కాపీలను స్వాధీనం చేసుకోవటానికి బంగవాణి కార్యాలయానికి రాగా ఒక్కటంటే ఒక్కటీ లేదక్కడ. చివరకు రామ్ ప్రసాదే... తన సోదరి నుంచి పుస్తకాన్ని అరువుగా తీసుకొని పోలీసులకు ఒక కాపీ ఇవ్వాల్సి వచ్చింది. బ్రిటిష్ సర్కారు 1927 జనవరి 4న ఈ నవలను నిషేధించటమేగాకుండా రచయిత శరత్ చంద్ర, పబ్లిషర్, ముద్రణకారులపై రాజద్రోహ నేరం మోపింది.
ఆంగ్లేయ సర్కారు నవలను నిషేధించటంపై నిరసన తెలపాల్సిందిగా రవీంద్రనాథ్ ఠాగూర్‌ను శరత్ కోరారు. కానీ ఆయన నిషేధాన్ని సమర్థించారు. ‘మీరు రాసిన నవల ప్రజల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకతను పెంచుతోంది. హింసను ప్రేరేపిస్తోంది. ఎలాంటి హింసకైనా నేను వ్యతిరేకం. ఆంగ్లేయ ప్రభుత్వాన్ని విమర్శించవద్దని నేనను. కానీ విమర్శలు చేసినప్పుడు వాటి పర్యవసానాలను కూడా భరించటానికి సిద్ధంగా ఉండాలి’ అంటూ ఠాగూర్ బదులిచ్చారు. దీనికి శరత్ కూడా అంతే ఘాటుగా స్పందించారు. ‘పర్యవసానాలకు సిద్ధపడే రాశాను. కాకుంటే ఓ ప్రజాస్వామ్యవాదిగా సర్కారు నిరంకుశ ధోరణిని నిరసించటం హక్కుగా భావిస్తున్నాను. ఆ హక్కును మీరు కూడా వినియోగించాలన్నదే నా ఉద్దేశం. అంతేగానీ ప్రభుత్వం నుంచి ఉపశమనం ఆశించటం కాదు. మీరన్నట్లు ప్రజల్లో ఇది చైతన్యం తెస్తే నా లక్ష్యం నెరవేరినట్లే’ అంటూ శరత్ తిప్పికొట్టారు. ప్రభుత్వానికి తలొగ్గటానికి మాత్రం ఆయన అంగీకరించలేదు. అటు బ్రిటిష్ సర్కారు అరాచకాలపై, ఇటు భారతీయ సమాజంలోని అవలక్షణాలపై తన కలంతో అలుపెరగకుండా పోరాడిన శరత్‌బాబు... 1938 జనవరి 16న కేన్సర్‌తో కన్నుమూశారు. రెండునెలల తర్వాత బెంగాల్ ప్రభుత్వం శరత్ నవలపై నిషేధం ఎత్తేసింది.
ఇదీ చదవండి: భారత టెక్నాలజీని కాపీ కొట్టి.. 'నెపోలియన్'ను ఓడించిన బ్రిటిషర్లు