Azadi ka amrit mahotsav: తొలుత రాజకీయాలకు దూరంగా ఉన్నా... గాంధీజీ ప్రభావంతో మనసు మార్చుకున్న సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ ప్రస్థానం అహ్మదాబాద్ మున్సిపాలిటీతో ఆరంభమైంది. 1845లో మున్సిపాలిటీలు మొదలయ్యాయి. లార్డ్ రిప్పన్ సంస్కరణలతో 1870 తర్వాత భారతీయులు స్వయం పాలన రుచిచూడటం మొదలెట్టారు. ప్రజల ద్వారా ఎన్నికైన భారతీయులే ఈ స్థానిక సంస్థలను నడిపించేవారు. మున్సిపాలిటీ అధ్యక్షుడు/ఛైర్మనే సర్వం సహాధికారిగా విద్య, వైద్యం, పారిశుద్ధ్యం, నీటిసరఫరా వంటి పట్టణ సదుపాయాలన్నీ చూసుకునేవారు. బ్రిటిష్ ప్రభుత్వం మెల్లగా వీటిలోనూ తలదూర్చింది. మున్సిపల్ చట్టాన్ని మార్చింది. ఐసీఎస్ అధికారులను వీటికి కమిషనర్లుగా నియమించింది. ఆ క్రమంలో అహ్మదాబాద్ మున్సిపాలిటీకి 1915లో వచ్చాడు ఐసీఎస్ అధికారి జె.ఎ.షిలిడి. ప్రజాప్రతినిధుల నిర్ణయాల్లో అడ్డుపుల్లలు; అవినీతితో పాటు ప్రజల్ని భయభ్రాంతుల్ని చేయటం మొదలెట్టాడు.
అలాంటి సమయంలో 1917లో... కార్పొరేటర్‌గా ఎన్నికైన పటేల్... పారిశుద్ధ్య కమిటీకి ఛైర్మన్ అయ్యారు. అప్పటికే ఆయన అహ్మదాబాద్‌లో పేరున్న, బాగా సంపాదిస్తున్న న్యాయవాది. అయినా పదవి వచ్చిందని పెత్తనం చేయలేదు. పొద్దున్నే పారిశుద్ధ్య కార్మికుల కంటే ముందే... రోడ్లపై చీపురు పట్టుకొని ఊడవటానికి సిద్ధంగా ఉండేవారు. వారితో కలసి పనిచేసేవారు. అంటరానితనం అధికంగా ఉన్న ఆ రోజుల్లో దళిత బస్తీలకు వెళ్లి శుభ్రం చేసి వచ్చేవారు. 1917లో అహ్మదాబాద్‌లో ప్లేగు వ్యాధి ప్రబలటంతో... అంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఆంగ్లేయ అధికారులైతే కనిపించటమే మానేశారు. ఈ దశలో... పటేల్ బయటికొచ్చి... వాడల్లో తిరుగుతూ... బాధితులకు, వారి కుటుంబాలకు ధైర్యం నూరిపోశారు. మిత్రులు ఆయన్ని వారించారు. ‘‘పారిశుద్ధ్య కమిటీ ఛైర్మన్‌గా బాధ్యతలు తీసుకుని ఇంట్లో కూర్చుంటే ఫలితమేంటి?’’ అంటూ రేయింబవళ్లు వీధుల్లోనే సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు.
రోజుకో వాడ చొప్పున తిరుగుతూ ప్రజల సమస్యల్ని అడిగి తెలుసుకునేవారు. ఆయన్ను చూసి... అనేక మంది యువకులు రంగంలోకి దిగారు. అలా ప్రజల్లో సేవాభావాన్ని రగిలించారు పటేల్! 'వీధుల్లోకి విసిరేయకుండా మున్సిపాలిటీ ఇచ్చే బుట్టల్లో చెత్త వేస్తే... మన పరిసరాలు శుభ్రంగా ఉండటమేగాదు... ఎక్కువకాలం బతకగలం' అంటూ అహ్మదాబాద్ వాసుల్లో ఆ కాలంలోనే స్వచ్ఛస్ఫూర్తిని నింపారు.
ఓ సాధారణ కార్పొరేటర్‌గానే... పదవి, హోదా కంటే కూడా ప్రజలకు సౌకర్యాలు, సేవ గురించి ఆలోచించి ఆచరణలో పెట్టిన పటేల్...తర్వాత మున్సిపాలిటీ అధ్యక్షుడయ్యారు. ‘స్థానిక పాలనను సమర్థంగా నడపటంలోనే స్వరాజ్యముంది’ అన్న గాంధీజీ మాటల్ని అహ్మదాబాద్‌లో ఆయన నిజం చేసి చూపించారు. స్వచ్ఛతలో, విద్యుదీకరణలో, మంచినీరు, విద్య సదుపాయాల కల్పనలో అహ్మదాబాద్‌ను అగ్రస్థానంలో నిలిపారు పటేల్!
ఐసీఎస్‌పై పోరు..
ఆంగ్లేయులున్న కంటోన్మెంట్ కాలనీలో నిరంతరం మంచినీరిస్తూ... మిగిలిన అహ్మదాబాద్ వాసులందరికీ ఇవ్వటం లేదని గుర్తించారు. దీనిపై ఆంగ్లేయ అధికారులను నిలదీశారు. ప్రజల పట్ల వివక్ష ప్రదర్శిస్తున్న ఇంజినీరును తక్షణమే తొలగించాలంటూ పట్టుబట్టారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులతో కూడా ఆయన కఠినంగా ఉండేవారు. ఓ బ్రిటిష్ అధికారి సెలవు పెట్టకుండా చాలారోజులు డుమ్మా కొట్టేసి... ఓరోజు వచ్చి సంతకాలు చేసుకోవటానికి ప్రయత్నించగా... పటేల్ పట్టుకున్నారు. చివరకు ఆ అధికారి రాజీనామా చేయాల్సి వచ్చింది. అహ్మదాబాద్‌లోని ఓ చెరువును ఆంగ్లేయుడొకరు కబ్జా చేయటం మొదలెట్టారు. దీనికి కమిషనర్ షిలిడి మద్దతిచ్చారు. ఐసీఎస్ అధికారికి వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడలేని పరిస్థితి. కానీ పటేల్ ఊరుకోలేదు. షిలిడీపై యుద్ధం ప్రకటించారు. వైస్రాయ్ నుంచి... ఇంగ్లాండ్ దాకా షిలిడీ పనితీరును ఆధారాలతో సహా నిలదీశారు. ‘‘మున్సిపాలిటీ ఆస్తులను కాపాడే ప్రాథమిక బాధ్యతలో కమిషనర్ విఫలమయ్యారు. తన వ్యక్తిగత ప్రయోజనాలకు ప్రాధాన్యమిచ్చి... ప్రజలకు అన్యాయం చేస్తున్నారు. ఇది పూర్తిగా ఆక్షేపణీయం’’ అంటూ పటేల్ లేఖ రాశారు. గాంధీజీ సైతం షిలిడీపై పటేల్ పోరాటానికి మద్దతిచ్చారు. ఆధారాలన్నీ ఆయనకు వ్యతిరేకంగా ఉండటంతో బ్రిటిష్ ప్రభుత్వం ఏమీ చేయలేక... కమిషనర్ షిలిడీపై చర్య తీసుకుంది. ఆ సమయంలో... ఓ ఆంగ్లేయ ఐసీఎస్ అధికారిపై బ్రిటిష్ ప్రభుత్వం చర్య తీసుకోవటం సంచలనం సృష్టించింది.
ఇదీ చదవండి: Azadi ka amrit mahotsav: భారతీయులను మహమ్మారికి వదిలేశారు!