Azadi ka amrit mahotsav: బ్రిటిష్ పాలనలోని బర్మా ప్రజలకు స్ఫూర్తినిచ్చేందుకు గాంధీజీ 1937లో ఆ దేశంలో పర్యటించారు. ఈ సందర్భంగా భారత్ నుంచి వెళ్లి అక్కడ స్థిరపడ్డ అనేక కుటుంబాలు ఆయన్ను కలిశాయి. భారత జాతీయోద్యమానికి మద్దతు పలికాయి. ఈ సందర్భంగా తమిళనాడు నుంచి వెళ్లి బాగా స్థిరపడ్డ ఓ సంపన్న కుటుంబంతో గాంధీ సమావేశమయ్యారు. వారి 10ఏళ్ల బాలిక రాజమణి బొమ్మ పిస్తోల్‌తో ఆడుకుంటోంది. ‘తుపాకీతో ఆడుతున్నావ్...షూటర్ కావాలనుకుంటున్నావా’ అని అడిగారు మహాత్ముడు! ‘‘లేదు... బ్రిటిష్‌వారిని షూట్ చేసేందుకు’’ అని వెంటనే బదులిచ్చింది ఆ చిన్నారి. ‘మనం అహింసా పద్ధతుల్లో వారితో పోరాడుతున్నాం. అదే మార్గంలో నడవాలి’ అని గాంధీజీ అనగానే... ‘‘‘‘లూటీ చేసేవారిని మనం షూట్ చేస్తాం కదా! బ్రిటిష్‌వారు మనల్ని లూటీ చేస్తున్నారు. కాబట్టి పెద్దయ్యాక ఒక్క ఆంగ్లేయుడినైనా షూట్ చేస్తా’’ అంటూ ఆ బాలిక తేల్చిచెప్పేసింది!
పదేళ్ల వయసులోనే అలా సమాధానమిచ్చిన రాజమణి టీనేజీలో అడుగుపెట్టేనాటికి రెండో ప్రపంచయుద్ధం వచ్చేసింది. గాంధీజీ జాతీయోద్యమంపై సానుకూలత ఉన్నా... ఆంగ్లేయులను పారదోలాలంటే అంతా ఆయుధాలు పట్టాలన్న సుభాష్ చంద్రబోస్ పిలుపు ఆమెను ఆకర్షించింది. ఆజాద్ హింద్‌ఫౌజ్‌కు వాలంటీర్లను భర్తీ చేసుకోవటంతో పాటు నిధుల సమీకరణకోసం 1944లో బోస్ బర్మా వచ్చారు. ఈ సందర్భంగా రాజమణి తన విలువైన నగలన్నింటినీ బోస్‌కు ఇచ్చేశారు. ఆమెలోని పసితనాన్ని చూసిన బోస్ వాటిని తీసుకునేందుకు నిరాకరించారు. కానీ ఆమె పట్టువీడకపోవటంతో ఆయన స్వయంగా వారి ఇంటికి వెళ్లారు. తల్లిదండ్రుల సమక్షంలో చెప్పారు. అయినా రాజమణి వెనక్కి తగ్గలేదు. ఈ క్రమంలో ఆమె పట్టుదల, తెలివిని గమనించిన బోస్... ఆభరణాల కంటే కూడా తననే ఆజాద్ హింద్ ఫౌజ్ (ఐఎన్‌ఏ)లో చేర్చుకుంటానని మాటిచ్చారు. రంగూన్‌లోని ఆసుపత్రిలో నర్స్‌గా అవకాశం కల్పించారు. అంతేగాకుండా తెలివి తేటలకు మెచ్చి ఆమె పేరుకు సరస్వతి-ని చేర్చారు. ఆనాటి నుంచి తను సరస్వతి రాజమణిగా మారింది. అయితే నర్స్ సేవలకే పరిమితం కాకుండా... ఫౌజ్‌లో మరింత క్రియాశీలకం కావాలనుకుంది. ఆమె ఉత్సాహాన్ని చూసిన బోస్ తనను రాణి ఝాన్సీ రెజిమెంట్‌లో చేర్చుకొని సైనిక శిక్షణ ఇప్పించారు. ఇంతలో ఐఎన్‌ఏ సేనలు ఇంఫాల్-కోహిమాకు సమీపంలోకి రావటంతో బర్మాలోని ఝాన్సీ రెజిమెంట్‌ను దానికి దగ్గరగా ఉన్న బర్మా ప్రాంతానికి తరలించారు. ఈ సందర్భంగా దుర్గ అనే సహచరురాలితో కలసి ఆంగ్లేయులపై గూఢచర్యం పనులు మొదలెట్టింది సరస్వతి. ఇద్దరూ జుట్టు కత్తిరించుకొని మగపిల్లల్లా తయారై... బ్రిటిష్ మిలిటరీ శిబిరాల్లో పనివారిగా కుదిరారు. ఆంగ్లేయ సైనికాధికారుల బట్టలుతుకుతూ, బూట్లు పాలిష్‌చేస్తూ... ఇంటి పనులు చేస్తూ... కీలకమైన సమాచారాన్ని ఐఎన్‌ఏ సహచరులకు అందిస్తూ బోస్‌కు చేరవేసేవారు. ఈ క్రమంలో ఓరోజు దుర్గ పట్టుబడింది. జైల్లో పెట్టారు. దీంతో తన స్నేహితురాలిని తప్పించటానికి సరస్వతి స్థానిక బర్మా నాట్యగత్తెలా తయారై జైలు అధికారులను తన నాట్యంతో మైమరిపించింది. అదే సమయంలో వారికి మత్తుమందు కలిపిన ద్రవం ఇచ్చి... దుర్గను తప్పించింది. పారిపోతున్న సమయంలో... జైలు బయట ఉన్న సిపాయిలు కాల్పులు జరపటంతో సరస్వతి కుడి కాలిలో తూటా దిగింది. వెంటనే ఇద్దరూ దగ్గర్లోని చెట్టెక్కి దాక్కున్నారు. రక్తం కారకుండా ఆకులు కట్టుకొని రెండ్రోజులు అలాగే ఉండిపోయారు. ఆంగ్లేయుల వెతుకులాట ముగిసిందనే నమ్మకం కలిగాక కిందికి దిగి... బస్సులో 8 గంటల ప్రయాణం చేసి రంగూన్ ఐఎన్‌ఏ శిబిరానికి చేరారు. వీరి సాహసాన్ని మెచ్చిన సుభాష్ చంద్రబోస్... లెఫ్టినెంట్ ర్యాంకు పదోన్నతితోపాటు సరస్వతిని తొలి భారతీయ మహిళ గూఢచారిణి అని ప్రశంసా పత్రం పంపించారు.
స్వాతంత్య్రానంతరం 1957లో సరస్వతి కుటుంబం తమిళనాడుకు తిరిగి వచ్చి తిరుచ్చి వద్ద స్థిరపడింది. అయితే ఆర్థిక పరిస్థితులు తలకిందులయ్యాయి. 1971 దాకా ఆమెకు ప్రభుత్వం స్వాతంత్య్ర సమరయోధుల పింఛన్ ఇవ్వలేదు. 2005 దాకా చెన్నైలోని ఓ చిన్న అపార్ట్‌మెంటులో జీవితం గడిపిన ఆమెను అప్పటి ముఖ్యమంత్రి జయలలిత ఆర్థికంగా ఆదుకున్నారు. 2004లో సునామీ బాధితులకు తన పింఛన్ మొత్తాన్ని విరాళంగా ఇచ్చిన సరస్వతి రాజమణి 90 ఏళ్ల వయసులో 2018 జనవరిలో కన్నుమూశారు.
ఇదీ చదవండి: స్వయంప్రతిపత్తి ఇస్తామని చెప్పి.. షాకిచ్చిన బ్రిటిషర్లు