Radhanath Sikdar Everest height: ప్రపంచంలో అత్యంత ఎత్తయిన పర్వతశిఖరం ఏదంటే మౌంట్ ఎవరెస్ట్ అని ఠక్కున చెప్పేస్తాం! కానీ నిజానికి మౌంట్ సిక్దర్ అని చెప్పాలి. కారణం- ఆ ఎత్తును తొలిసారిగా కనుగొన్న అగణిత ప్రతిభాశాలి రాధానాథ్ సిక్దర్! ఆయనకు ఆ ఘనత దక్కకుండా చేసి ... ఎన్నడూ ఆ పర్వతాన్నే చూడని ఆంగ్లేయ అధికారి ఎవరెస్ట్ పేరు తగిలించి... ప్రపంచానికి ఆ పేరుతోనే పర్వతాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చింది అప్పటి బ్రిటిష్ సర్కారు!
Radhanath Sikdar Biography: కలకత్తాలో 1813లో పేద కుటుంబంలో జన్మించిన రాధానాథ్ సిక్దర్‌కు చదువొక్కటే ఆధారమైంది. గణితంపై చిన్నప్పటి నుంచీ ఇష్టం పెంచుకున్న ఆయన 1824లో కలకత్తా హిందూ కళాశాల (ప్రస్తుత ప్రెసిడెన్సీ)లో సీటు సంపాదించారు. న్యూటన్, యూక్లిడ్, జెప్సన్, విండ్‌హౌస్‌లాంటి గణిత మేధావుల సిద్ధాంతాలను ఔపోసన పట్టిన సిక్దర్ త్రికోణమితిలో తనదైన పద్ధతులను కనుక్కోవటం ఆరంభించారు. అదే సమయంలో సర్వేయర్ జనరల్ జార్జ్ ఎవరెస్ట్ సారథ్యంలో భారత ఉపఖండాన్ని శాస్త్రీయంగా సర్వే చేయించే ప్రాజెక్టు మొదలెట్టింది బ్రిటిష్ సర్కారు. దానికి గ్రేట్ ట్రిగనామెట్రిక్ సర్వే (జీటీఎస్) అని పేరు పెట్టారు. ఈ ప్రాజెక్టు కోసం ఓ ప్రతిభావంతుడైన గణిత మేధావి కోసం ఆరా తీస్తున్నాడు ఎవరెస్ట్. హిందూ కళాశాల ఆచార్యుడొకరు సిక్దర్ పేరును ఆయనకు సిఫార్సు చేశారు.
అలా... 1831 డిసెంబరులో 18వ ఏటనే సిక్దర్ నెలకు 40 రూపాయల వేతనంతో 'కంప్యూటర్'గా జీటీఎస్‌లో చేరారు. కంప్యూటర్‌లు లేని ఆ కాలంలో... లెక్కించేవారి కొలువును 'కంప్యూటర్' అనేవారు. సిక్దర్ గణిత ప్రతిభను, త్రికోణమితిలో అతడి చొరవ, సొంత ప్రయోగాలు చూసి ఎవరెస్ట్ ముచ్చటపడ్డాడు. ఎంతగా అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన్ను విడవటానికి అంగీకరించేవాడు కాదు. ఓ విద్యాసంస్థ మెరుగైన జీతభత్యం ఇస్తామనటంతో అధ్యాపక వృత్తిలోకి వెళ్లటానికి సిక్దర్ మొగ్గు చూపగా... ఎవరెస్ట్ వెంటనే ఆంగ్లేయ సర్కారుకు లేఖ రాశారు. "ఈ కుర్రాడు మనకు ఇక్కడ ఉపయోగపడటమేగాదు... ఐరోపాలోనూ పేరు ప్రఖ్యాతులు తెస్తాడు. అతణ్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదు" అంటూ జీతం పెంచాలని సిఫార్సు చేశాడు. ఫలితంగా రూ100 పెంచారు.
1945లో చీఫ్ కంప్యూటర్‌గా పదోన్నతి కూడా సిక్దర్‌కు లభించింది. అప్పటికే ఎవరెస్ట్ పదవీ విరమణ చేశాడు. ఆయన శిష్యుడు కర్నల్ ఆండ్రూ స్కాట్ వా సర్వేయర్ జనరల్‌గా బాధ్యతలు చేపట్టాడు. 1845 నుంచి జీటీఎస్ ఈశాన్య హిమాలయ శ్రేణులను కొలవటం మొదలెట్టింది. అప్పటి వరకు కాంచనజంగ పర్వతశిఖరాన్ని ప్రపంచంలో అత్యంత ఎత్తైనదిగా భావించేవారు. వివిధ పర్వత శ్రేణులను గమనిస్తూ, లెక్కిస్తూ వచ్చిన సిక్దర్ 1852లో పర్వతం 15గా పేరొందినదే... అన్నింటికంటే ఎత్తుగా ఉందని తేల్చారు. భారత భూభాగంలోంచి త్రికోణమితి సూత్రాలతో సిక్దర్ దీన్ని లెక్కించారు. "1852లో ఓ రోజు ఉదయం... బాబు (సిక్దర్) పరుగెత్తుకుంటూ స్కాట్ వా గదిలోకి వచ్చారు. సర్... ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతాన్ని కనుగొన్నాను అంటూ చెప్పాడు" అని బ్రిటిష్ శాస్త్రవేత్త కెనెత్ మాసన్ తర్వాతికాలంలో వెల్లడించారు. పర్వతం 15గా అప్పటిదాకా పిలుస్తున్న దాని ఎత్తును సిక్దర్ 29వేల అడుగులుగా గణించారు.
ఈ విషయాన్ని బయట పెట్టకుండా నాలుగేళ్లపాటు పరిశీలించిన స్కాట్ వా సిక్దర్ చెప్పింది నిజమేనని 1856లో అంగీకరించక తప్పలేదు. అయితే... 29వేల అడుగులని కచ్చితంగా చెబితే నమ్మరని... దానికి రెండు జోడించి 29వేల రెండు అడుగులు అని అధికారికంగా ప్రకటించాడు. అక్కడితో ఆగకుండా... ఈ ఎత్తును కనుగొన్న ఘనతను సిక్దర్‌కు ఇవ్వలేదు. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన ఈ పర్వతానికి సిక్దర్ పేరు కాకుండా... తనకంటే ముందు పనిచేసిన గురువు జార్జ్ ఎవరెస్ట్ పేరు పెట్టాలంటూ బ్రిటిష్ సర్కారుకు సిఫార్సు చేశాడు. రాయల్ జియోగ్రాఫికల్ సొసైటీ అందుకు అంగీకరించింది. ఎన్నడూ ఎవరెస్ట్‌నే చూడని ఎవరెస్ట్ పేరును... ప్రపంచంలో అత్యంత ఎత్తైన పర్వతానికి పెట్టింది. సిక్దర్ కృషిని కనీసం గుర్తించనైనా లేదు. వందేళ్ల దాకా (1955లో భారత్ మళ్లీ సర్వే చేసి 29వేల 29 అడుగులని చెప్పేదాకా...) సిక్దర్ లెక్కే ప్రామాణికంగా నిలిచింది. 1870లో మరణించిన సిక్దర్‌తో పాటే 'ఎవరెస్ట్ ఎత్తు' సాక్షిగా ఆయన పేరూ చరిత్ర పుటల్లోంచి కనుమరుగైపోయింది.
వృత్తికి అంకితమైన సిక్దర్ ఎన్నడూ ఆంగ్లేయులకు తలవంచలేదు. 1843లో సర్వే చేస్తున్న సిక్దర్ బృందాన్ని ఓ ఆంగ్లేయ న్యాయాధికారి 'పహారీ కూలీలు'గా అభివర్ణించాడు. ఇందుకు సిక్దర్ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తంజేశారు. ధైర్యంగా నిలబడి నిరసన వ్యక్తంజేయటంతో... రూ.200 జరిమానా విధించారు. అయినా ఆయన తన వ్యక్తిత్వాన్ని మాత్రం కోల్పోవటానికి ఇష్టపడలేదు. మహిళల విద్య కోసం ప్రత్యేకంగా మాసిక్ పత్రికను ఆరంభించారు.
ఇదీ చదవండి: