Azadi ka Amrit Mahotsav: 1948, జనవరి 29 మధ్యాహ్నం.. దిల్లీలో గాంధీజీ బస చేసిన బిర్లాహౌస్‌కు ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ కుటుంబమంతా వచ్చింది. నెహ్రూ, ఆయన సోదరి కృష్ణ, కుమార్తె ఇందిర, మనవడు నాలుగేళ్ల రాజీవ్‌గాంధీ, సరోజినీ నాయుడు నేరుగా గాంధీజీ ఎండకు చలి కాచుకుంటున్న తోటలోకి వచ్చారు. కాసేపయ్యాక.. నాలుగేళ్ల రాజీవ్‌గాంధీ.. అతిథులు తెచ్చిన పూలన్నింటినీ ఏరుకొని వచ్చి గాంధీ పాదాల చుట్టూ అమర్చసాగాడు. బాల రాజీవ్‌ను సరదాగా చెవి మెలిక పెడుతూ.. 'అలా చేయకూడదు. చనిపోయిన వాళ్ల కాళ్లదగ్గరే అలా పూలు అమరుస్తారు' అంటూ వారించారు గాంధీజీ.
నెహ్రూ కుటుంబం వెళ్లిపోయాక మతకలహాల్లో దెబ్బతిని రోడ్డున పడ్డ ఓ గ్రామస్థులు గుంపుగా వచ్చారు. అందులోంచి ఒకరు 'నువ్వు మా అందరినీ నాశనం చేశావు. చేసిన నష్టం చాలు. ఇకనైనా అందరినీ వదిలి ఏ హిమాలయాలకో వెళ్లిపో' అంటూ బిగ్గరగా ఆగ్రహంతో అరిచారు.
తన మనవరాలు మనూగాంధీతో.. 'అతగాడి ఆక్రందన భగవంతుడి వాక్కులా అనిపిస్తుంది. నాకూ, నీకూ ఇది మరణ సంకేతం'అన్నారు గాంధీజీ. అయితే 'హిమాలయాల్లో నాకు శాంతి లభించదు. ఈ సంఘర్షణల మధ్యే శాంతిని కోరుకుంటున్నాను. వీటి మధ్యే మరణించాలనుకుంటున్నాను. అంతా భగవదేచ్ఛ. ఆయన నన్ను తీసుకుపోవచ్చు' అంటూ వేదాంత ధోరణి ప్రదర్శించారు.
అలా మరణిస్తేనే మహాత్ముడిని..
జనవరి 29 రాత్రి గాంధీజీ చాలా నీరసించారు. ఎంత పని చేసినా ఎన్నడూ అనని గాంధీజీ ఆ పూట అలసటగా ఉందన్నారు. అయినా స్వాతంత్య్రానంతరం కాంగ్రెస్ పార్టీ అనుసరించాల్సిన కొత్త నియమ నిబంధనల ముసాయిదాను తయారు చేశారు.
పదేపదే దగ్గుతుండటంతో.. పెన్సిలిన్ ఇంజక్షన్ ఇవ్వటానికి మనూ సిద్ధపడ్డారు. గాంధీజీ నిరాకరించారు. 'ఏ నిమిషానికి ఏమౌతుందో ఎవరికి తెలుసు? నేను బతికుంటానో లేదో' అంటూ.. మరణానంతరం తనను ఎలా గుర్తుంచుకోవాలో, తన గురించి ప్రజలకు మనూ ఏం చెప్పాలో వివరించారాయన.
"ఒకవేళ ఏదైనా రోగంతో మరణిస్తే నేను మహాత్ముడిని కాదని ఇంటిపైకప్పుకెక్కి మరీ ఈ లోకానికి చాటు. అప్పుడు ఎక్కడున్నా నా ఆత్మ శాంతిస్తుంది. అలా చెప్పినందుకు నాపై ప్రేమతో జనాలు నిన్ను నిందించొచ్చు. అయినా నువ్వు అలాగే చెప్పాలి. అలాకాకుండా గతవారంలాగా ఏదైనా బాంబు పేలో.. లేక ఎవరైనా నన్ను ఛాతీలో తూటాలతో కాల్చో చంపితే.. రామనామం ఉచ్ఛరిస్తూ నేను తనువు చాలిస్తే.. అప్పుడు నేను నిజమైన మహాత్ముడినని చెప్పు."అన్నారు.
బతికుంటే కలుస్తానని చెప్పు..
జనవరి 30న... ఉదయం అమెరికా లైఫ్ మేగజీన్ ఫొటోగ్రాఫర్ మార్గరెట్ బూర్క్‌వైట్ ఇంటర్వ్యూ చేసేందుకు వచ్చారు. అదే గాంధీజీ చివరి ముఖాముఖి. 125 ఏళ్లు జీవించాలన్న మీ తపన ఇంకా అలాగే ఉందా? అని అడిగారు మార్గరెట్. "ప్రపంచంలో జరుగుతున్న ఘోరాలను చూశాక నాలో ఆ ఆశపోయింది" అన్నారు గాంధీ. ఆయన ఆఖరి సమావేశం సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్‌తో సాయంత్రం 4గంటలకు మొదలైంది. నెహ్రూ-పటేల్ మధ్య విభేదాల గురించిన భేటీ అది. గంటకుపైగా సీరియస్‌గా సాగిందది. ఇంతలో గాంధీని కలవటానికి స్వస్థలం నుంచి కొంతమంది వచ్చారు. అదే విషయం తెలపగా.. "ప్రార్థన తర్వాత కలుస్తానని చెప్పు. అదీ బతికుంటే"అంటూ బదులిచ్చారు.
సమయం తప్పారు..
రోజూ సాయంత్రం ఐదింటికి గాంధీజీ ప్రార్థన ఆరంభం. ఆ రోజూ ఐదయినా ఆయన రాలేదు. గదిలో సర్దార్ పటేల్‌తో ఆంతరంగికంగా జరుగుతున్న చర్చలు ఓ పట్టాన తెగేలా లేవు. దీంతో మనూ గడియారం చూపించి.. ఐదు దాటి ఐదు నిమిషాలు అని సూచించారు. గాంధీ లేచారు. పటేల్ వెళ్లిపోయారు. అప్పటికే పది నిమిషాలు ఆలస్యం కావటంతో.. దగ్గరి దారిలో ప్రార్థనాస్థలికి తన సహాయకులు వెంటరాగా వడివడిగా నడక ఆరంభించారు. ఆయన మనసులో ఏముందో తెలియదుగాని.. ఆ క్షణాన ఎవ్వరూ అనుకోలేదు మహాత్ముడు మరణానికి ఎదురెళుతున్నారని! 5.17కు ఆయన గడియారం ఆగిపోయింది!
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చూడండి: భారత్ కోసం పోరాడిన ఆంగ్లేయురాలు.. అభినవ మీరాబెన్