indian constitution important amendments: 1950.. జనవరి 26న రాజ్యాంగం అమలులోకి రావడం వల్ల భారత్ సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించింది. ఇంగ్లండ్, ఐర్లండ్, జపాన్, అమెరికా, ఫ్రాన్స్ తదితర దేశాల రాజ్యాంగాల్లోని మేలైన అంశాల మేళవింపుతో.. ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగంగా పేరుగాంచింది. ప్రజల హక్కులకు, సమాజ వికాసానికి, దేశ ప్రయోజనాలకు అవరోధాలుగా నిలుస్తున్న అనేక సమస్యలకు రాజ్యాంగ సవరణల ద్వారా పరిష్కారం చూపుతూనే ఉంది. 368వ అధికరణం ప్రకారం.. రెండు విధానాల్లో ఈ సవరణలు సాధ్యమవుతాయి. కొన్నింటికి పార్లమెంటులో సాధారణ బలాధిక్యం ఉంటే చాలు. రెండో విధానంలో మాత్రం పార్లమెంటు ఉభయసభల సభ్యుల్లో 2/3 వంతు మంది హాజరై, వారిలో సగానికిపైగా మంది సవరణలను సమర్థించాలి. కనీసం సగం రాష్ట్రాలు కూడా ఇందుకు అంగీకరించాలి. ఇలా 2021 అక్టోబరు నాటికి 105 రాజ్యాంగ సవరణలు చోటుచేసుకున్నాయి. వాటిలో ముఖ్యమైన కొన్ని సవరణలను ఏ ఏడాదిలో ఎందుకు చేపట్టారంటే..
1951: మొదటి సవరణ చట్టం ద్వారా ఆర్టికల్-19ని మార్పు చేశారు. వాక్ స్వాతంత్య్రంపైనా, వృత్తి, వ్యాపార నిర్వహణ హక్కుపైనా కొన్ని 'సహేతుక' నియంత్రణలు ప్రవేశపెట్టారు. భూసంస్కరణలకు స్థిరమైన రూపునిస్తూ, వ్యక్తిగత హక్కుల పరిధి నుంచి తొలగిస్తూ ఆర్టికల్ 31ఏ, 31బీలను చేర్చారు.
1956: భాషా ప్రాతిపదికన రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణకు మార్గం సుగమం చేస్తూ ఏడో సవరణ తీసుకొచ్చారు. దీంతో ఏ, బీ, సీ, డీ ప్రాతిపదికన రాష్ట్రాల వర్గీకరణను రద్దుచేశారు. దేశ భూభాగాలను 14 రాష్ట్రాలు, 6 కేంద్ర పాలిత ప్రాంతాలుగా గుర్తించారు. ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాలకు గవర్నర్‌ను నియమించడానికి.. రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు ఉమ్మడి హైకోర్టును ఏర్పాటు చేయడానికి ఈ రాజ్యాంగ సవరణ దోహదపడింది.
1971: రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక హక్కులను తొలగించే అధికారం పార్లమెంటుకు లేదని సుప్రీంకోర్టు 1967లో గోలక్‌నాథ్ కేసులో తీర్పు ఇచ్చింది. ఈ క్రమంలో వచ్చిందే 24వ రాజ్యాంగ సవరణ. ఆర్టికల్ 13, 368లను సవరించడం ద్వారా.. ప్రాథమిక హక్కులు సహా రాజ్యాంగంలోని ఏదైనా భాగంలో మార్పులుచేసే అధికారాన్ని పార్లమెంటుకు కట్టబెట్టారు. రాజ్యాంగ సవరణ బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం పొందడాన్ని తప్పనిసరి చేశారు.
1976: రాజ్యాంగ సవరణల్లో 42వ రాజ్యాంగ సవరణను కీలక పరిణామంగా భావిస్తారు. స్వరణ్‌సింగ్ కమిటీ సిఫారసులను అనుసరించి దీన్ని చేపట్టారు. పీఠికలో 'సామ్యవాద, లౌకిక, సమగ్రత' అనే పదాలను చేర్చారు. రష్యా నుంచి గ్రహించిన పది ప్రాథమిక విధులను ఆర్టికల్-51ఏలో చేర్చారు. ఆర్టికల్-74(1) ప్రకారం కేబినెట్ సలహాను రాష్ట్రపతి తప్పనిసరిగా పాటించాలని నిర్దేశించారు. సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయసమీక్ష అధికారాన్ని పరిమితం చేస్తూ.. రాజ్యాంగ సవరణలను ఏ న్యాయస్థానంలోనూ సవాలు చేయరాదని విస్పష్టం చేశారు. ఆదేశిక సూత్రాల అమలుకు చేసిన చట్టాలు ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తున్నాయన్న కారణంతో.. కోర్టులు ఆ చట్టాలను రద్దుచేసే వీల్లేదని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వానికి ఏ రాష్ట్రానికైనా కేంద్ర సాయుధ బలగాలను పంపే అవకాశం కల్పించారు. ఆర్టికల్-352 ద్వారా విధించే అత్యయిక పరిస్థితిని ఏ ప్రాంతంలోనైనా విధించేలా మార్పులు చేశారు.
1978: రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, లోక్‌సభ స్పీకర్ ఎన్నికలకు సంబంధించిన వివాదాల విషయంలో ఎన్నికల సంఘం అధికారాలను 44వ సవరణ ద్వారా పునరుద్ధరించారు. ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించి, చట్టబద్ధమైన హక్కుగా పేర్కొన్నారు. పత్రికా స్వేచ్ఛను పునరుద్ధరించారు. కేంద్ర మంత్రిమండలి సలహా లేనిదే జాతీయ అత్యవసర పరిస్థితి విధించకూడదని స్పష్టం చేశారు. ప్రాథమిక హక్కులను దాఖలుపరిచే ఆర్టికల్-20, 21లు జాతీయ అత్యయిక పరిస్థితిలో రద్దు కావని పేర్కొన్నారు. కేబినెట్ నిర్ణయాన్ని పునస్సమీక్ష నిమిత్తం వెనక్కుపంపే వెసులుబాటును రాష్ట్రపతికి కల్పించారు.
1988: ఓటు హక్కు అర్హత వయసును 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు కుదిస్తూ 61వ సవరణ తీసుకొచ్చారు. దీంతో ఒక్కసారిగా సుమారు 5 కోట్ల మంది యువతకు ఓటు హక్కు లభించింది. దేశాన్ని సరైన దిశలో ముందుకు నడిపించే సత్తా యువతకు ఉందని, వారిపై అఖండ విశ్వాసంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని నాటి ప్రధాని రాజీవ్‌గాంధీ పార్లమెంటులో చెప్పారు.
2002: ఆర్థిక పరిమితుల కారణంగా రాజ్యాంగ నిర్మాతలు విద్యను ప్రాథమిక హక్కుల జాబితాలో చేర్చలేదు. అయితే, కాలక్రమంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడటం వల్ల 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 6-14 ఏళ్ల వయసు బాలలకు విద్యను అభ్యసించే హక్కును కల్పించారు. తదనంతరం 2009లో విద్యా హక్కు చట్టం వచ్చింది.
2019: దేశంలో ఆర్థిక వెనుకబాటుతనం కారణంగా ఎవరూ విద్య, ఉద్యోగ అవకాశాల్లో వెనకంజ వేయరాదన్న ఉద్దేశంతో ఈబీసీ వర్గాలకు రిజర్వేషన్లు కల్పిస్తూ 103వ రాజ్యాంగ సవరణ చేపట్టారు. ఇందుకు కుటుంబ వార్షిక గరిష్ఠ ఆదాయాన్ని రూ.8 లక్షలుగా నిర్ణయించారు.
దేశం అభివృద్ధి చెందడమంటే అద్దాల మేడలు, రంగుల గోడలు కాదు. ప్రజల నైతికాభివృద్ధే నిజమైన దేశాభివృద్ధి. రాజ్యాంగం ఎంత మంచిదైనా, దాన్ని అమలుచేసేవారు చెడ్డవారైనప్పుడు... అది చెడ్డదిగానే మిగిలిపోతుంది. రాజ్యాంగం ఎంత చెడ్డదైనా... దాన్ని అమలుచేసేవారు మంచివారైతే అది మంచిదిగానే నిలుస్తుంది.
- డా.బి.ఆర్.అంబేడ్కర్
ఇవీ చదవండి: నవ సంకల్పంతో, సరికొత్త దారిలో ప్రయాణించే సమయం ఆసన్నమైందన్న మోదీ