Azadi Ka Amrit Mahotsav: సుమారు 200 సంవత్సరాల ఆంగ్లేయుల పాలనలో భారత్ నుంచి దోచుకుపోయిన సంపద గురించో.. భారతీయులకు జరిగిన కష్టనష్టాల గురించో చర్చ సహజం. కానీ వారు నాశనం చేసిన అటవీ సంపద, ఆధిపత్యం, ఆహ్లాదం కోసం చంపిన మూగజీవుల సంఖ్య, పర్యావరణ విధ్వంసం ఎక్కువగా వెలుగుచూడని కోణం. భారత్‌లో ఆంగ్లేయుల హయాంలో అడవుల్లో మూగజీవుల హననం ఎలా సాగిందో అంచనా వేయటానికి.. 1911లో జరిగిన ఓ సంఘటన చాలు. 1911 డిసెంబరులో దిల్లీ దర్బార్‌లో పాల్గొనటానికి వచ్చిన బ్రిటన్ చక్రవర్తి జార్జ్-5 వేటకు వెళ్లారు. 14వేల మంది మార్బలాన్ని వెంటబెట్టుకొని 600 ఏనుగులపై అడవుల్లోకి వెళ్లిన జార్జ్-5 ఒక్కరోజే 39 పులుల్ని, 18 ఖడ్గమృగాలను, 4 ఎలుగుబంట్లను, ఒక చిరుతను పొట్టనబెట్టుకొని మీసాలు మెలేశాడు. జార్జ్ యూల్ అనే సివిల్ సర్వెంట్ ఒక్కడే తన సర్వీసులో 400 పులులను, జెఫ్రీనైటింగేల్ అనేవాడు 300 పులుల్ని తమ తుపాకికి బలిచ్చారు. చిరుతలు ఇతర జంతువులైతే లెక్కేలేదు.
దట్టమైన అడవులతో.. అసంఖ్యాక జంతుజాలంతో అలరారుతున్న భారతీయ అడవులు ఆంగ్లేయులకు ఆటమైదానంలా కనిపించాయి. వేటాడటాన్ని మగతనంగా.. భారతీయులపై ఆధిపత్యానికి చిహ్నంగా భావించేవారు. వ్యక్తిత్వవికాసానికి వేట ఓ సాధనమని.. పేకాట, మత్తుమందుల్లాంటి చెడు అలవాట్లకు బానిస కాకుండా వేట కాపాడుతుందని ప్రవచించేవారు. అందుకే చిన్నాచితకా అధికారి కూడా పులిని చంపి ఆటల్లో ట్రోఫీతో దిగినట్లు.. దానితో ఫొటోకు ఫోజులిచ్చేవారు. అంతేగాకుండా.. అడవి జంతువులను చంపటం నాగరికతకు సంకేతమనేవారు. భారతీయులను రక్షించటానికి, నాగరికులను చేయటానికే ఇదంతా అని కూడా సమర్థించుకునేవారు. యుద్ధ సన్నాహకంగా.. అడవుల్లో వేటను సైనికాధికారులు ప్రోత్సహించేవారు.
అడవులపైనా తమ పెత్తనం చెలాయించటానికి.. 1878లో అటవీ చట్టం తీసుకొచ్చారు. దీని ద్వారా దేశంలో ఐదోవంతు భూమిని తమ వేటస్థలంగా మార్చారు. అడవులు ఆంగ్లేయ సర్కారు ఆస్తిగా మారాయి. వాటిలో వేట వారికి ప్రత్యేక హక్కుగా దఖలు పడింది. భారత సంస్థానాధీశులు ఆంగ్లేయులకు ఏజెంట్లుగా వ్యవహరించేవారు. అత్యంత నాణ్యమైన కలపతో పాటు జంతుచర్మాలు, ఏనుగు దంతాలు, కొమ్ములు, ఎముకలు.. ఇలా ఒకటేమిటి.. ప్రదర్శించుకునేవి, పైసలు వచ్చేవి అన్నింటినీ బ్రిటన్‌కు తరలించారు. ఫలితంగా అడవులనే నమ్ముకొని తరతరాలుగా బతుకుతున్న అడవిబిడ్డల జీవితాలు దెబ్బతిన్నాయి. తమ వేటకు సహకరించేవారిని తప్పించి, స్థానిక గిరిజనులను వేట సమయంలో అడవిలోకి అడుగు పెట్టనిచ్చేవారు కాదు. అందుకే.. అనేక ప్రాంతాల్లో ఆదివాసీల తిరుగుబాట్లు చోటుచేసుకున్నాయి.
1900లో భారత్‌లో లక్షకుపైగా రాయల్ బెంగాల్ పులులుండేవి. ప్రభుత్వ రికార్డుల ప్రకారమే.. 1875 నుంచి 1925 మధ్య కనీసం 80వేల పులుల్ని చంపారు. ఒక్క 1878 సంవత్సరంలోనే 1579 పులుల్ని సరదాగా చంపినట్లు ఆంగ్లేయ సర్కారు ప్రకటించింది. అత్యంత అరుదైన మంచు చిరుత చర్మంతో ఇంపీరియల్ క్యాడెట్లకు దుస్తులు కుట్టిస్తానంటూ భారత వైస్రాయ్ చేసిన ప్రకటనపై అప్పట్లో బ్రిటన్ పార్లమెంటులో చర్చ జరిగింది. చనిపోయిన జంతువుల కళేబరాల్లో తుక్కు నింపి.. వాటిని మళ్లీ బతికున్నవాటిలా కనిపించేలా చేసి.. అమ్మే కంపెనీ వాన్‌ఇంగెన్ మైసూరులో 1900లోనే దుకాణం తెరచింది. ఆ ఫ్యాక్టరీ లెక్కల ప్రకారం.. తొలి 50 సంవత్సరాల్లో 25వేల పులులు, 30వేల చిరుతలు, లక్షల్లో ఇతర అడవి మృగాల కళేబరాలను అమ్మారు. పర్యావరణానికి, సమాజానికి ఒక పులి వల్ల కలిగే లాభాన్ని ఆర్థికంగా లెక్కిస్తే.. సుమారు రూ.280 కోట్ల రూపాయలని ఈ మధ్యే ఓ నిపుణుల బృందం నివేదిక ఇచ్చింది. ఆ లెక్కన.. 80వేల పులులను చంపి ఆంగ్లేయులు మనకు చేసిన నష్టమెంతో?
ఇదీ చూడండి: ఆంగ్లేయుల తుపాకులకు.. అడవి బాణాలతో బదులిచ్చిన ఆదివాసీ వీరుడు!