Azadi Ka Amrit Mahotsav: ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామానంతరం పరిస్థితులు సర్దుకొన్నాక... పాలనలో భారతీయులకు భాగస్వామ్యంపై డిమాండ్లు మొదలయ్యాయి. ఇందులో ప్రధానపాత్ర జాతీయ కాంగ్రెస్‌లోని మితవాదులది. ఆంగ్లేయులతో అప్పుడే పోరాడటం కంటే... రాజ్యాంగ బద్ధంగా స్వయం ప్రతిపత్తి సాధించుకోవాలనుకునేవారు వీరు.
Gopala krishna gokhale Gandhi
ఆ కోవలోకి చెందిన తొలితరం నేత గోపాలకృష్ణ గోఖలే. 1866లో మహారాష్ట్రలోని రత్నగిరిలో నిరుపేద కుటుంబంలో జన్మించిన గోఖలే ఆంగ్లేయులతో పోటీపడి... ప్రతిష్ఠాత్మక బొంబాయి ఎల్ఫిన్‌స్టోన్ కాలేజీలో చదివారు. పుణె ఫెర్గూసన్ కాలేజీలో రాజకీయ, ఆర్థికశాస్త్ర ప్రొఫెసర్‌గా చేరారు. 1889లో జాతీయ కాంగ్రెస్‌లో చేరిన మూడేళ్లకు ఆచార్య వృత్తికి రాజీనామా చేశారు. బొంబాయి లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడిగా, ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడిగా పనిచేశారు. 1909 మింటో మార్లే సంస్కరణల రూపకల్పనలో కీలకపాత్ర పోషించిన ఆయన... కేంద్రంలో, రాష్ట్రాల్లో లెజిస్లేటివ్ కౌన్సిళ్లను విస్తరించటానికి కృషి చేయటమేగాకుండా... బ్రిటిష్ బ్యూరోక్రసీ కబంధ హస్తాలను వీడి పాలనాధికారాలు పంచాయతీలు, తాలూకాలకు విస్తరించాలని పట్టుబట్టారు. మహిళలకు విద్య కోసం వాదించారు. అంటరానితనంపైనా పోరాడారు. సమాజ సేవ, సంస్కరణల కోసమే సర్వెంట్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీని స్థాపించి భారతీయుల్లో విద్యావ్యాప్తికి కృషి చేశారు. విద్యావంతమైన సమాజమే... బ్రిటిష్‌ను ఎదుర్కోగలుగుతుందని బలంగా విశ్వసించారు. 1905 బెనారస్ సదస్సులో కాంగ్రెస్ అధ్యక్షుడైన ఆయన... విప్లవవాదం కాకుండా అహింసా పద్ధతిలో భారత్ తన లక్ష్యాలను సాధించుకోవాలని ఆశించారు. తనను విమర్శించిన అతివాదులు లాలా లజపత్‌రాయ్, తిలక్‌లతోనూ మిత్రత్వం నెరపిన మితవాది ఆయన.
Gandhi Gokhale first meet
గాంధీ-గోఖలేలు 1896లో మొదట పుణెలో కలిశారు. 1901 కోల్‌కతా కాంగ్రెస్ సదస్సులో మళ్లీ కలిశారు. గాంధీని అర్థం చేసుకున్న ఆయన... భారత్‌కు వచ్చేయమని కోరారు. కానీ ఆ కోరిక మరో 14 ఏళ్లకుగాని తీరలేదు. కొలువు కోసం వెళ్లి క్రమంగా దక్షిణాఫ్రికాలో భారతీయుల హక్కుల ఉద్యమంలో భాగమైన గాంధీజీకి గోఖలే ఇక్కడి నుంచే సాయం చేసేవారు. ఉద్యమానికి నిధులు సేకరించి పంపించేవారు. 1912లో దక్షిణాఫ్రికా వెళ్లి.. గాంధీజీ తరఫున అక్కడి బ్రిటిష్ ప్రభుత్వంతో మాట్లాడి భారతీయుల సమస్యలకు పరిష్కారం చూపి వచ్చారు గోఖలే. అలా గాంధీ ఆలోచనలను, నాయకుడిగా ఎదుగుతున్న తీరును క్రమం తప్పకుండా గమనిస్తూ వచ్చారు. భారత స్వాతంత్ర్యోద్యమానికి గాంధీ సారథ్యం వహించాల్సిన సమయం, సత్తా రెండూ వచ్చాయని భావించి.. భారత్‌కు తిరిగి రావాలని గాంధీపై ఒత్తిడి తెచ్చారు. ఫలితంగా 1915 జనవరి 9న బొంబాయి రేవులో దిగారు గాంధీజీ. ఆయన్ను ఆహ్వానించటానికి పుణె నుంచి ప్రత్యేకంగా వచ్చారు గోఖలే. రాగానే గాంధీజీని ప్రచారహోరులో, పేరు ప్రఖ్యాతుల ప్రలోభంలో పడొద్దని సూటిగా హెచ్చరించారు.
''నోరు తెరవకుండా... ఎక్కువగా మాట్లాడకుండా దేశమంతా తిరుగు. ప్రజల్నీ పరిస్థితులనూ అర్థం చేసుకో'' అని నిధులు సమకూర్చి మరీ యావద్దేశం చుట్టివచ్చే ఏర్పాటు చేశారు. ''మన శక్తియుక్తులను, ఆత్మనంతటినీ దేశసేవ కోసం వినియోగించాలి. సమయాన్ని వృథా చేయొద్దు. రాజకీయ ఐక్యత ఈ దేశానికి ఆయువు పట్టు'' అని తన సహచరులకు సూచించిన గోఖలే తన శిష్యుడు గాంధీ సారథ్యాన్ని చూడకుండానే 1915 ఫిబ్రవరి 19న అనారోగ్యంతో 49వ ఏట కన్నుమూశారు.
'ముస్లిం గోఖలే కావాలనుంది'
''గోఖలే నా రాజకీయ గురువు. తొలిసారి ఆయన్ను కలిసినప్పుడే ఎంతో ఉత్సాహంగా అనిపించింది. నన్ను సొంత తమ్ముడిలా ఆప్యాయంగా చూసుకున్నారు. ఆయనతో ఉంటే ఎంతో విజ్ఞానవంతంగా ఉండేది. ఒక్క నిమిషం కూడా వృథా చేసేవారు కాదు. ఆయన వ్యక్తిగత సంబంధాలు, సంభాషణలు... స్నేహాలు... అన్నీ ప్రజల మేలుకోరే ఉండేవి. ప్రతి మాటలో, చేతలో దేశ క్షేమమే తప్ప మరోటి ఉండేదే కాదు. ధీశాలి... అసలైన దేశభక్తుడు... ధర్మాత్ముడు'' అని గాంధీజీ నివాళులర్పించారు. 'ధర్మాత్మ గోఖలే' అంటూ ఆయనపై గాంధీ ఓ పుస్తకం రాశారు. కేవలం గాంధీయే కాదు ముస్లింలీగ్ నేత మహమ్మద్ అలీ జిన్నా సైతం గోఖలేను ఎంతగానో అభిమానించేవారు. 'నాకు ముస్లిం గోఖలే కావాలనుంది' అని జిన్నా రాశారంటే గోఖలే ప్రభావం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.
ఇదీ చదవండి: ఆఖరి పోటు.. నావికుల తిరుగుబాటు