Azadi Ka Amrit Mahotsav: బతుకేశ్వర్‌దత్ ఉరఫ్ మోహన్ ఉరఫ్ దత్తుగా అలనాటి విప్లవయోధులకు పరిచయం బీకే దత్. ఆంగ్లేయుల అరాచకం బాల్యంలోనే ఆయనపై ప్రభావం చూపింది. 1910 నవంబరు 18న బెంగాల్‌లోని బుర్ధ్వాన్ జిల్లాలో జన్మించిన దత్ చదువు కాన్పుర్‌లో జరిగింది. బడిలో చదివేటప్పుడు ఓ రోజు... ఆంగ్లేయులకు మాత్రమే ప్రత్యేకించిన రోడ్డులో నడిచాడని 10 ఏళ్ల భారతీయ బాలుడిని బ్రిటిష్‌వారు చితకబాదారు. ఆ క్షణమే ఆంగ్లేయులపై దత్‌లో ఆగ్రహం మొలకెత్తింది. కాన్పుర్‌లోనే ఆయనకు హిందుస్థాన్ సోషలిస్టు రిపబ్లికన్ అసోసియేషన్ (హెచ్‌ఎస్‌ఆర్‌ఏ)తో పరిచయమైంది. చంద్రశేఖర్ ఆజాద్, భగత్‌సింగ్ తదితరులతో దోస్తానా కుదిరింది. వారితో కలసి బాంబుల తయారీ నేర్చుకున్నాడు కూడా.
బ్రిటిష్ సర్కారు ప్రజారక్షణ, కార్మిక వివాదాల బిల్లును సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. అయితే... అసెంబ్లీలో ఈ బిల్లు ఒక్క ఓటుతో వీగిపోయింది. దీంతో ఆర్డినెన్స్ రూపంలో దొడ్డిదారిన అమల్లోకి తెచ్చింది ఆంగ్లేయ సర్కారు. దీనికి నిరసనగా... దిల్లీలోని సెంట్రల్ అసెంబ్లీలో బాంబు పేల్చి ప్రభుత్వాన్ని భయపెట్టాలని హెచ్‌ఎస్‌ఆర్‌ఏ నిర్ణయించింది. చంద్రశేఖర్ ఆజాద్ అందుకు ఇష్టపడలేదు. దీనివల్ల సాధించేదేమీ లేదని భావించాడు. కానీ... మిగిలినవారంతా కలసి భగత్‌సింగ్ బాంబు ప్రణాళికకు అంగీకరించేలా ఆజాద్‌ను ఒప్పించారు. తనతో పాటు దత్‌ను ఎంచుకున్నాడు భగత్. ఈ ప్రయత్నంలో చివరి దాకా వెంట ఉంటానని మాటిచ్చాడు దత్.
1929 ఏప్రిల్ 8న భగత్‌సింగ్, దత్ సందర్శకుల గ్యాలరీలో చోటు సంపాదించారు. 11 గంటలకు ఒక్కసారిగా లేచి... ఇంక్విలాబ్ జిందాబాద్ (విప్లవం వర్ధిల్లాలి) అని నినాదాలు చేస్తూ... ఖాళీ సీట్లున్న దిక్కుకు బాంబులను విసిరారు. దీంతో... సభలో కలకలం రేగి... సభ్యులంతా తలోదిక్కుకు పరుగెత్తారు. వీరు కూడా తప్పించుకునే వీలున్నా... అక్కడే నిలబడిపోయారు. అనుకున్నట్లుగానే బాంబులు శబ్దం చేశాయే తప్ప ఎవ్వరికీ హాని చేయలేదు. అయినా... దాడిని తీవ్రంగా పరిగణించిన ఆంగ్లేయ ప్రభుత్వం భగత్‌సింగ్, దత్‌లను అరెస్టు చేసి విచారణలో భాగంగా లాహోర్ జైలుకు తరలించింది. అక్కడే వీరిద్దరూ రాజకీయ ఖైదీలకు హక్కులు, సౌకర్యాలపై నిరాహార దీక్ష చేసి కొన్నింటిని సాధించారు. ఈ కేసుతో పాటు... భగత్‌సింగ్‌పై పోలీసు అధికారి శాండర్స్‌ను చంపిన లాహోర్ కేసును కూడా విచారించి ఉరిశిక్ష విధించారు. అసెంబ్లీ బాంబు కేసులో దత్‌కు జీవితఖైదు విధించి... 1929 జూన్‌లో అండమాన్ జైలుకు పంపించారు. దత్ తరఫున ఈ కేసులో వాదించిన సమరయోధుడు అసఫ్ అలీ... అసలు అసెంబ్లీలో బాంబు విసరటంలో ఆయన పాత్ర లేదని, మిత్రుడికి తోడుగా ఉండటం కోసం... నెపం తనపైనా వేసుకున్నాడని వెల్లడించారు. దాడి తర్వాత అసెంబ్లీ నుంచే కాకుండా... తర్వాత కేసు నుంచీ తాను తప్పించుకునే వీలున్నా దత్ అలా చేయలేదు. చివరి దాకా తనతో ఉంటానని భగత్‌కు ఇచ్చిన మాటకు కట్టుబడి యావజ్జీవ శిక్ష అనుభవించారు.
పేదరికంలో మగ్గి...
1938లో దత్‌ను విడుదల చేశారు. ఆ సమయానికి క్షయ వ్యాధి బారిన పడ్డ ఆయన... లక్ష్యాన్ని మాత్రం మరచిపోలేదు. 1942 క్విట్ ఇండియా బరిలో దిగారు. మళ్లీ నాలుగేళ్లు జైలుకు వెళ్లాల్సి వచ్చింది. స్వాతంత్య్రానంతరం... అనేక మంది వీరులను భారత ప్రభుత్వం సత్కరించింది. కానీ దత్‌కు మాత్రం ఆ గౌరవం దక్కలేదు. క్యాన్సర్ బారిన పడి... పేదరికంలో గడిచిన ఆయనకు పట్నా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కూడా లభించలేదు. పంజాబ్ ప్రభుత్వం వెయ్యి రూపాయలిచ్చి... దిల్లీలో చికిత్స చేయించేందుకు ముందుకొచ్చింది. 1964లో దిల్లీ తీసుకొచ్చారు. తనను చూడటానికి వచ్చిన పంజాబ్ ముఖ్యమంత్రితో... ‘విప్లవకారులనగానే చేతుల్లో తుపాకులు పట్టుకున్న వారిగానే చూస్తున్నారు. వారు కలలుగంటున్న సమాజాన్ని మరచిపోతున్నారు’ అంటూ ఆవేదన వ్యక్తంజేశారు దత్. ఆప్తమిత్రుడు భగత్‌సింగ్ సమాధి వద్దే తనకూ అంత్యక్రియలు చేయాలన్నది ఆయన చివరి కోరిక. 1965 జులై 20న దత్ అనంతవాయువుల్లో కలసిపోయారు. భారత్-పంజాబ్ సరిహద్దుల్లో... భగత్‌సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురుల అంత్యక్రియలు చేసిన చోటే ఆయనకూ చేశారు.
ఇదీ చూడండి: Azadi Ka Amrit Mahotsav: యావద్దేశం సై... గాంధీజీ నై