ETV Bharat / bharat

గాంధీ లేని నాటకం రాస్తే రూ.50 వేలు ఇస్తామన్న ఆంగ్లేయులు.. తలొగ్గని దేశభక్తుడు - సాహితవేత్త దామరాజు పుండరీకాక్షుడు

ఆయన నాటకం చూస్తే పాషాణ హృదయమైనా కరగాల్సిందే! వీరావేశంతో స్వాతంత్య్రోద్యమంలో దూకాల్సిందే! అక్షరాన్నే ఆయుధంగా మలచుకొని.. తెల్లవారిపై నాటకాలతో సాయుధ పోరాటం చేసిన అరుదైన తెలుగు వీరుడు దామరాజు పుండరీకాక్షుడు! రచనలను నిషేధించినా ఆయన్ను కట్టడి చేయలేకపోయిన ఆంగ్లేయ సర్కారు చివరకు.. గాంధీ ఊసు లేకుండా నాటకం రాస్తే రూ.50 వేలిస్తామంటూ ఆశపెట్టింది.

damaraju pundarikakshudu
దామరాజు పుండరీకాక్షుడు
author img

By

Published : Jul 26, 2022, 6:37 AM IST

స్వాతంత్య్రోద్యమం ఊపందుకున్న రోజుల్లో గాంధీ టోపీ పెట్టినా, గాంధీ మీద పద్యం పాడినా ఆంగ్లేయులు అగ్గిమీద గుగ్గిలమయ్యేవారు. ఉద్యమ నాటకాలు రాయడాన్ని, వాటిని ప్రదర్శించడాన్ని రాజద్రోహ చర్యగా పరిగణించేవారు బ్రిటిష్‌ పాలకులు. ఆ బెదిరింపులను తాటాకు చప్పుళ్ల కింద జమకట్టిన యోధుడు పుండరీకాక్షుడు. ఆ పరిస్థితుల్లోనూ గాంధీనే స్తుతిస్తూ.. ఉద్యమ ఆవశ్యకతను ప్రజలకు వివరిస్తూ నాటకాలు రాసి, ప్రదర్శిస్తుండేవారాయన. 1896 జూన్‌ 5న పూర్వ గుంటూరు (ప్రస్తుత పల్నాడు) జిల్లా సత్తెనపల్లి తాలూకా పాటిబండ్ల గ్రామంలో దామరాజు పుండరీకాక్షుడు జన్మించారు. గుంటూరు, కృష్ణా, విశాఖపట్నం ప్రాంతాల్లో ప్రాథమిక, ప్రాథమికోన్నత విద్య చదివి మద్రాసులో బి.ఎ., బి.ఎల్‌.(న్యాయశాస్త్రం) పూర్తి చేశారు. ఓ వైపు చదువుకుంటూనే.. మరోవైపు బ్రిటిష్‌ కర్కశపాలనను ఎండగడుతూ, జాతీయోద్యమం వైపు ప్రజలను జాగృతం చేస్తూ తన సాహిత్యానికి పదునుపెట్టారు.

'డైరాసుర'..: గుంటూరు గాంధీపేట (నేటి అరండల్‌పేట)లో పుండరీకాక్షుడు 'స్వరాజ్య సోపాన నిలయం' ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి వెలువడిన దేశభక్తి గేయాలు, పద్యాలు, నాటకాలు, హరికథలు, బుర్రకథలు ఆంగ్లేయుల్లో ప్రకంపనలు సృష్టించాయి. జలియన్‌ వాలాబాగ్‌ దురాగతాన్ని 'మహాభారతం' కథలో ఇమిడ్చి పుండరీకాక్షుడు రాసిన 'పాంచాల పరాభవం' నాటకం అప్పట్లో ఓ సంచలనం. ఈ నాటకంలో జనరల్‌ డయ్యర్‌ను 'డైరాసుర'గా సంబోధిస్తూ దుశ్శాసునిడిగా, భరతమాతను పాంచాలిగా, మహాత్మాగాంధీని కృష్ణుడిగా పోల్చారు. శ్వేతజాతీయుల చేతుల్లో చిక్కి, వెక్కివెక్కి ఏడుస్తున్న భరతమాతను గాంధీ ఓదార్చుతూ.. సత్యాగ్రహ దీక్షతో ప్రజలను స్వరాజ్య సమరంవైపు మళ్లించే ఇందులోని ఘట్టం సామాన్యులను ఆలోచింపజేసింది. దుశ్శాసునిడిగా చిత్రీకరిస్తూ డయ్యర్‌ దిష్టిబొమ్మను తగులబెట్టడాన్ని తెల్లవారు జీర్ణించుకోలేకపోయారు. ఈ నాటక ప్రదర్శన బ్రిటన్‌ పార్లమెంటులోనూ చర్చకు వచ్చింది. ఫలితంగా బ్రిటిష్‌ ప్రభుత్వం భారత్‌లో 'పాంచాల పరాభవం' నాటకాన్ని నిషేధించింది. ఆ నాటక ప్రతులనూ తగులబెట్టించింది. చివరికి.. దామరాజు రచించిన నాటకాలపై ఉక్కుపాదం మోపింది. వాటిని ప్రదర్శించేవారికి లాఠీదెబ్బలు, కారాగారవాసం తప్పేదికాదు! ఉద్యమాలు, ఉద్యమ నాయకుల పేర్లమీద ప్రదర్శిస్తే.. దొరికిపోతానన్న ఉద్దేశంతో 'హరిశ్చంద్ర', 'రాయబారం', 'చింతామణి' వంటి నాటకాల గురించి ముందుగా ప్రచారం చేసేవారు. సమయానికి ప్రదర్శించేది మాత్రం.. 'నవయుగ గాంధీ విజయం', 'రణభేరి', 'క్విట్‌ ఇండియా' లాంటి నాటకాలు!!

రాజకీయ నాటకాలతో ప్రజల్ని చైతన్యపరుస్తున్న పుండరీకాక్షుడిని తమ అదుపాజ్ఞల్లో పెట్టుకోవడానికి బ్రిటిష్‌ పాలకులు ఎన్నో ఎత్తులు వేశారు. చివరికి 'కనీసం నాటకాల్లో గాంధీజీ పాత్ర లేకుండా అయినా రాయండి' అంటూ ఓ ప్రతినిధితో ప్రభుత్వం రాయబారం పంపింది. అలా చేస్తే నజరానాగా యాభై వేల రూపాయలు ఇస్తామని కూడా ఆశజూపింది. అప్పట్లో రూ.50 వేలు అంటే మాటలు కాదు. కానీ పుండరీకాక్షుడు ఆ ప్రలోభానికి లొంగలేదు. సరికదా.. 'గాంధీ లేనిది సాగదు నా కలమ్ము..' అంటూ ఓ పద్యం రాసి, ఆ రాయబారి ద్వారానే బ్రిటిష్‌ పాలకులకు పంపించారాయన.

పుండరీకాక్షుడు రాసిన దేశభక్తి గేయాలు, పాటలు, ఒగ్గుకథలు, బుర్రకథలు.. ప్రముఖులు, పండితపామరుల మెప్పుపొందడమే కాదు.. సగటు భారతీయుల నోళ్లలోనూ నానుతూ వారిలో జాతీయభావాలను పెంపొందించేవి. కాంగ్రెస్‌ సభల్లో 'ఎవ్వని శాంతమూర్తియని ఎల్లరనారతమునన్‌...' 'శ్రీగాంధీ నామం మరువం మరువం.. నిత్యం జైలుకు వెరువం.. వెరువం..' అన్న దామరాజు గీతాలే వినిపించేవి. ఈయన రాసిన నాటకాలను ఆచార్య ఎన్జీ రంగా ఇంగ్లాండ్‌లో ప్రదర్శించి అరెస్టు అయ్యారు. దేశంలో రాజకీయ నాటకాల తొలి రచయితగా పేరును సుస్థిరం చేసుకున్న దామరాజు పుండరీకాక్షుడు 1975లో కన్నుమూశారు.

కక్షకట్టి.. ఫెయిల్‌ చేస్తే..: మద్రాసులో బి.ఎల్‌. చేస్తున్న సమయంలో పుండరీకాక్షుడి రచనలను ఆ కళాశాల యూరోపియన్‌ అధ్యాపకులు గుర్తించారు. ప్రతీకార చర్యగా పరీక్షలో ఉద్దేశపూర్వకంగానే ఫెయిల్‌ చేశారు. ఆయన దీనిపై సత్యాగ్రహ పద్ధతిలో నిరసన తెలుపుతూ అధికారులను నిలదీశారు. చివరకు తమ వద్ద సమాధానమేమీ లేక అధికారులు పుండరీకాక్షుడు ఉత్తీర్ణత సాధించినట్లు ప్రకటించారు.

ఇవీ చదవండి: భారత్​లో బలమైన ప్రజాస్వామ్యానికి 1937లోనే పునాది.. ఆ ఎన్నికలతో..

పేద ప్రజల ఆకలి తీర్చాడని.. ఉరి తీశారు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.