భారత్‌లో అడుగుపెట్టిన నాటి నుంచీ కోల్‌కతా కేంద్రంగా పాలించిన ఆంగ్లేయులు.. తమ ముద్రలన్నీ కోల్‌కతాలోనే వేస్తూ వచ్చారు. భవంతుల నుంచి మొదలెడితే.. చదువుల దాకా, వలస రాజ్య లక్షణాలన్నీ అడుగడుగునా కన్పించే కేంద్రంగా కోల్‌కతా మారింది. జాతీయ కాంగ్రెస్ రూపంలో ఉద్యమం ఆరంభమైనా.. తమ విభజించు పాలించు సూత్రం ముందు అదేమంతగా ఆందోళన చెందాల్సిన అంశంగా వారికి కనిపించలేదు. భారత్‌లోని పీత రాజకీయాలు, మతాలు, కులాల రూపంలో తమకు అందుబాటులో ఉన్న 'విభజన' అవకాశాలు- తెల్లవారిలో ధైర్యాన్ని నింపాయి. భారత్‌ను శాశ్వతంగా ఏలటానికి ఎత్తుగడలు వేశారు. అందులో భాగంగా రాజధానిని కోల్‌కతా నుంచి దిల్లీకి మార్చారు.
వైస్రాయ్ లార్డ్ హార్డింగ్(viceroy lord hardinge) ఇందుకు ముందస్తు ఏర్పాట్లు చేశాడు. 1911లో బ్రిటన్ చక్రవర్తి జార్జ్-5 గౌరవార్థం దిల్లీలో ఘనంగా దిల్లీ దర్బార్ ఏర్పాటు చేశారు. అంతకుముందు కూడా మూడుసార్లు దర్బార్‌లు జరిగినా.. బ్రిటన్ చక్రవర్తి స్వయంగా హాజరవటం ఇదే తొలిసారి. ఆ సందర్భంగానే.. 1911 డిసెంబరు 12న చక్రవర్తి జార్జ్ ఉన్నట్టుండి రాజధాని మార్పును ప్రకటించారు. ఇకమీదట భారత్‌లో బ్రిటిష్ పాలన కోల్‌కతా కాకుండా దిల్లీ నుంచి జరుగుతుందంటూ ఆయన చేసిన ప్రకటన యావద్దేశాన్ని ఆశ్చర్యంలోకి నెట్టేసింది. ఆంగ్లేయుల్లోనూ చాలామంది ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. బెంగాల్‌ను విభజించిన వైస్రాయ్ లార్డ్ కర్జన్(viceroy lord curzon) బహిరంగంగానే తన అసంతృప్తిని ప్రకటించాడు. "కోల్‌కతా నుంచి బ్రిటిష్ పాలనను దిల్లీకి మార్చటం ప్రభుత్వానికి ప్రమాదకరమని భావిస్తున్నాను" అని హెచ్చరించాడు కూడా!
ఇవీ చదవండి:
- సాయుధ తిరుగుబాటుతో.. బ్రిటిష్ గవర్నర్ తలకే వెలగట్టి!
- Azadi Ka Amrit Mahotsav: బాపూను బతికించి.. తాను కష్టాలకోర్చి..
స్వపక్షంలోనే వ్యతిరేకత వ్యక్తమైనా.. భారత్‌లో తమ అధికార స్థిరత్వానికి రాజధాని మార్పు కీలకమని బ్రిటన్ ప్రభుత్వం బలంగా నమ్మింది. మొఘలుల నాటి నుంచి రాజధానిగా ఉండటం వల్ల దిల్లీ రాజకీయ వాతావరణం కూడా అందుకు అనువుగా ఉంటుందనుకుంది. భారత్‌పై సుదీర్ఘ పట్టుకు దిల్లీ నుంచి పాలన తోడ్పడుతుందనుకుంది. బెంగాల్‌లో విప్లవవాదం పెరగటం కూడా తెల్లవారికి కాసింత చికాకుగా మారింది. వెరసి.. ఇవన్నీ కలసి దిల్లీ దిశగా నడిపించాయి.
దర్బార్‌లో ప్రకటన వెలువరించిన వెంటనే.. చక్రవర్తి జార్జ్, రాణి మేరీలు.. కొత్త రాజధానికి శంకుస్థాపన కూడా చేసేశారు. నాలుగేళ్లలో కొత్త దిల్లీని నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ తొలి ప్రపంచ యుద్ధంతో(world war one).. నిధులు కేటాయించలేక పని సాగిలపడింది. ఫలితంగా.. 1931 నాటికిగాని కొత్త దిల్లీ నిర్మాణం పూర్తికాలేదు. సరికొత్త భవంతులు, పట్టణ నిర్మాణంతో భారత్‌పై తమ పట్టు ఇప్పట్లో తొలగేది కాదని ఆంగ్లేయులు పరోక్షంగా సంకేతాలు పంపించారు. కొన్నేళ్ల తర్వాత లండన్‌లో జరిగిన ఓ సమావేశానంతరం.. జవహర్‌లాల్ నెహ్రూ.. అప్పటి వైస్రాయి లార్డ్ లిన్‌లిత్‌గోల మధ్య వాడీవేడీ సంవాదంలో ఆ విషయం ప్రస్ఫుటమైంది. 'చూడండి.. పదేళ్లలో మేం స్వాతంత్య్రం సాధించుకొని తీరతాం' అని నెహ్రూ ఆగ్రహంగా అనటంతో.. 'అబ్బే.. అది సాధ్యంగాని పని. నేనూ మీరు బతికుండగా.. మన జీవితకాలంలో భారత్‌కు స్వాతంత్య్రం రావటం కల్ల' అని వైస్రాయ్ లిన్‌లిత్‌గో(viceroy lord linlithgow) బదులిచ్చారు.
కానీ.. చివరకు కర్జన్ హెచ్చరికే నిజమైంది. అధికారాన్ని సుస్థిరం చేసుకుందామని కొత్త దిల్లీకి మారిన కొన్నేళ్లకు.. రవి అస్తమించనిదనుకున్న బ్రిటిష్ సామ్రాజ్యం.. అంతరించింది.
ఇవీ చదవండి: