Ayodhya Ram Statue : ఉత్తర్ప్రదేశ్ అయోధ్యలోని రామ మందిరం గర్భగుడిలో ప్రతిష్ఠించే శ్రీరాముడి విగ్రహం పనులు 90 శాతం పూర్తయ్యాయి. రాముడి విగ్రహం అక్టోబర్ 30 నాటికి పూర్తిగా సిద్ధమవుతుందని ప్రముఖ శిల్పి విపిన్ భదౌరియా తెలిపారు. ఆ తేదీ నాటికి విగ్రహాన్ని ట్రస్ట్ సభ్యులు వీక్షించేందుకు సిద్ధం చేస్తామని చెప్పారు. బాల రాముడి రూపంలో విగ్రహం ఉంటుందని వివరించారు.
మూడు రాముడి విగ్రహాలు..
Ayodhya Ram Height : మొత్తంగా మూడు రాముడి విగ్రహాలను తయారు చేయిస్తున్నారు. వేర్వేరు శిల్పులు వీటిని చెక్కుతున్నట్లు తెలుస్తోంది. ఈ మూడు విగ్రహాల్లో అత్యంత సుందరంగా కనిపించే దాన్ని ఎంపిక చేసి రామ మందిరం గర్భ గుడిలో ప్రతిష్ఠాపన చేస్తారు. రాముడి విగ్రహం అందరినీ ఆకట్టుకునేలా ఉంటుందని విపిన్ భదౌరియా చెబుతున్నారు.
"భక్తులు ఊహించుకున్న దాని కంటే రాముడి విగ్రహం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇందుకోసం బాగా కష్టపడ్డాం. 51 అంగుళాల ఎత్తుతో రాముడి విగ్రహం ఉంటుంది. బాల రాముడి రూపంలో విగ్రహం ఉంటుంది. విగ్రహం పనులు 90 శాతం పూర్తయ్యాయి. బాలుడి రూపంలో ఉండే రాముడు ధనస్సు, విల్లు ధరించి ఉంటాడు. కమలంపై కూర్చొని ఉంటాడు. విగ్రహానికి తుది మెరుగులు దిద్దుతున్నాం. అక్టోబర్ 30 నాటికి ఇది పూర్తవుతుంది. తర్వాత విగ్రహాలను ట్రస్టు పరిశీలిస్తుంది."
-విపిన్ భదౌరియా, శిల్పి
ఇదిలా ఉండగా, అయోధ్య రామ మందిర నిర్మాణం శరవేగంగా సాగుతోంది. ప్రాణప్రతిష్ఠాపన కార్యక్రమం కోసం ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. జనవరి 22న విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ట్రస్టు సభ్యులు ఆహ్వానించారు. దీంతో పాటు అనేక మంది ప్రముఖులకు సైతం ఆహ్వానాలు పంపించారు. భారీ ఎత్తున ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమాలు జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. జనవరి 15 నుంచి 24 వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ వెల్లడించారు. మరోవైపు, మందిర నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఆలయం గ్రౌండ్ ఫ్లోర్ పనులు 98 శాతం పూర్తయ్యాయి. తొలి అంతస్తు పనులు 60 శాతం వరకు పూర్తయ్యాయి.
290 Stone Pillars In India : 'జగదానందకారక జయ జానకీ ప్రాణనాయక!'.. దేశంలో 290 చోట్ల 'శ్రీరామ' స్తంభాలు
Goddess Durga Dashavatar Idol : 16వ శతాబ్దం నాటి దశావతార దుర్గామాత విగ్రహం.. ఆదరణ కరవు