


మహేంద్ర కుమార్ స్వరాష్ట్రం బిహార్. 25-30 ఏళ్లుగా దిల్లీలోనే ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. వేసవిలో సూర్య ప్రతాపంతో విసిగిపోయిన అతడికి.. రెండేళ్ల క్రితం ఓ 'చల్లటి' ఆలోచన వచ్చింది. అనుకున్నదే తడవుగా.. దానిని ఆచరణలో పెట్టాడు. ఆటోపై మినీ తోట వేశాడు. ఇందుకోసం టాప్‌పై మ్యాట్ పరిచి, మట్టి వేసి.. మొక్కలు నాటాడు. రోజూ నీళ్లు పోసి, ఎప్పటికప్పుడు మొక్కలు కత్తిరిస్తూ.. ఆటో తోటను జాగ్రత్తగా చూసుకుంటున్నాడు.
ఆటోపై రెండేళ్లుగా ఇలా మొక్కలు పెంచుతున్నా. ఆటో మొత్తం చల్లగా ఉంటుంది. లోపల కూలర్, ఫ్యాన్ కూడా పెట్టా. ప్రయాణికులు చాలా సంతోషిస్తున్నారు. చూడగానే సెల్ఫీలు, ఫొటోలు తీసుకుంటున్నారు. ఈ మొక్కల్ని చూసిన ఆనందంతో రూ.10-20 ఎక్కువ ఇస్తున్నామని చెబుతున్నారు. నువ్వు చాలా మంచి పని చేస్తున్నావు, ఇప్పటి వరకు ఇలా ఎవరినీ చూడలేదు అని పొగుడుతున్నారు. ప్రభుత్వం నీకు అవార్డ్ ఇవ్వాలి, ఇంకా ఇవ్వలేదా అంటున్నారు.
--మహేంద్ర కుమార్, ఆటో డ్రైవర్
టమాట, బెండకాయ, జామ, మామిడి, అరటి.. ఇలా 25 రకాల మొక్కలు మహేంద్ర కుమార్ ఆటోపై ఉన్నాయి. ఈ మినీ తోట.. అతడికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది. దూరం నుంచి చూసే.. మహేంద్ర ఆటో వస్తోందని గుర్తుపడుతున్నారు. కొందరు ఆటోలో ప్రయాణించాల్సిన ప్రతిసారీ అతడికే ఫోన్ చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి దిల్లీ వచ్చిన వారు.. ఈ ఆటో తోటను చూసి ఫిదా అవుతున్నారు.
నేను ఒక అరుదైన దృశ్యం చూశా. వేడి తగ్గించేందుకు ఆటోపై మొక్కలు పెంచుతున్నారు. ఫొటో తీసుకున్నా. ఆటో డ్రైవర్‌తో మాట్లాడా. ఎలా, ఎందుకు చేశారని అడిగా. ఇది మంచి ప్రయత్నం. వీలుంటే అందరూ ఇలా చేయాలి.
--జెరీన్, కేరళ వాసి

