ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఇటావాలో ట్రక్కు లోయలో పడింది. ఈ ఘటనలో 12 మంది మృతి చెందగా.. 45 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఉది-ఛకర్ నగర్ రోడ్ ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగిందని అధికారులు పేర్కొన్నారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరం చేసినట్లు తెలిపారు.
డ్రైవర్ తప్పిదం వల్లే భక్తులతో ఆగ్రా నుంచి ఇటావా కాళికా దేవి ఆలయానికి వెళ్తున్న ట్రక్కు లోయలో పడిందని ఏఎస్పీ ప్రశాంత్ కుమార్ ప్రసాద్ స్పష్టం చేశారు. 30 అడుగుల లోతులో ట్రక్కు పడిందని.. 10 మంది అక్కడికక్కడే మృతిచెందగా ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారని తెలిపారు.
బాధితులందరూ ఆగ్రా వాసులే అని ఇటావా చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఎన్ఎస్ తోమర్ తెలిపారు. తీవ్రంగా గాయాలైన 13 మంది సైఫైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. మిగతా 32 మందిని జిల్లా ఆసుపత్రిలో చేర్పించినట్లు పేర్కొన్నారు.
సీఎం దిగ్భ్రాంతి..
12 మంది మృతి పట్ల యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
ఇదీ చదవండి: రక్తపాతం మధ్య బంగాల్ నాలుగో విడత పోలింగ్