త్రిపుర, నాగాలాండ్‌లో 'కాషాయ' జెండా రెపరెపలు.. మేఘాలయలో NPP హవా! - nagaland election result live update
ఈశాన్య రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ముమ్మరంగా సాగుతోంది. త్రిపుర, నాగాలాండ్‌లో భాజపా కూటమి ముందంజలో ఉంది. మేఘాలయలో సీఎం సంగ్మాకు చెందిన ఎన్పీపీ పార్టీ దూసుకెళ్తోంది.
మూడు ఈశాన్య రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. త్రిపుర, నాగాలాండ్ రాష్ట్రాల్లో భాజపా ఆధిక్యం కనబరుస్తోంది. నాగాలాండ్‌లో నేషనలిస్ట్ డెమొక్రిటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ- భాజపా కూటమి మరోసారి ఏర్పాటు చేసే అవకాశం ఉంది. నాగా పీపుల్స్ ఫ్రంట్ రెండో స్థానంలో కొనసాగుతోంది. కాంగ్రెస్, ఎన్పీపీ సింగిల్ డిజిట్ సీట్లకే పరిమితమయ్యేలా కనిపిస్తున్నాయి. త్రిపురలో భాజపా మెజార్టీకి పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
మేఘాలయలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగినట్టే ఏ పార్టీ.. స్పష్టమైన మెజారిటీ దక్కించుకునేలా లేదు. ప్రస్తుతం అధికారంలో ఉన్న నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ) అతిపెద్ద పార్టీగా అవతరిస్తోంది. బీజేపీ, యూడీపీ పార్టీలు కలిపి సుమారు పది స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో సీఎం సంగ్మాకు చెందిన ఎన్పీపీ నేతృత్వంలోని 'మేఘాలయ ప్రజాస్వామ్య కూటమి' అధికారంలో ఉంది. బీజేపీ, యూడీపీ అందులో భాగంగా ఉన్నాయి. ఎన్నికల్లో మాత్రం వేర్వేరుగా పోటీ చేశాయి. అయితే, ఏ పార్టీకీ మెజార్టీ రాని పక్షంలో మరోసారి ఈ పార్టీలు కూటమిగా ఏర్పడే అవకాశం ఉంది.
మరోవైపు, దేశవ్యాప్తంగా జరిగిన వివిధ ఉప ఎన్నికలకు సంబంధించి ప్రాథమిక ఫలితాలు విడుదలయ్యాయి. తమిళనాడు ఈరోడ్ (తూర్పు) నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి ఎలాంగోవన్ ఆధిక్యంలో ఉన్నారు. మహారాష్ట్రలో రెండు స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. అందులో కస్బా స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి రవీంద్ర దంగేకర్ ఆధిక్యంలో ఉండగా.. చించ్వాడ్ స్థానంలో బీజేపీ నేత అశ్వినీ జగ్తప్ దూసుకెళ్తున్నారు.