Assam Mizoram Border Dispute: అసోం- మిజోరం సరిహ్దదులో శాంతిస్థాపనకు ఇరురాష్ట్రాలు ముందుకు వచ్చాయి. అంతర్రాష్ట్ర సరిహద్దు సమీపంలో ఇప్పటివరకు ఉన్న ఉద్రిక్తత పరిస్థితులను తగ్గించేందుకు కీలక నిర్ణయం తీసుకున్నాయి. సరిహద్దు వివాదాలను (assam-mizoram border news) పరిష్కరించడానికి కమిటీలను ఏర్పాటు చేయాలని ఈ మేరకు ఇరు రాష్ట్రాలు నిర్ణయించాయి. గతంలో ఇక్కడ జరిగిన హింసాకాండలో ఐదుగురు అసోం పోలీసులు, ఓ పౌరుడు చనిపోయారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన సమావేశమైన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ నిర్ణయం తీసుకున్నారు. రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు ముఖ్యమంత్రులు వరుసగా రెండోసారి సమావేశమయ్యారు. సరిహద్దు వ్యవహారంపై ముఖ్యమంత్రి స్థాయి చర్చలు ఎప్పటికప్పుడు జరుగుతున్నాయని అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ట్వీట్ చేశారు.
"సరిహద్దు వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి ఇరు రాష్ట్రాలు కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. ఈ దిశగా ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రుల స్థాయి చర్చలు కూడా జరుగుతున్నాయి. చర్చలు జరగడంలో కీలకపాత్ర పోషించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కృతజ్ఞతలు."
- హిమంత బిశ్వ శర్మ, అసోం ముఖ్యమంత్రి
అసోం, మిజోరాం రాష్ట్రాలకు మధ్య 164 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు ఉంది. ఆగస్టు 2020లో అంతర్రాష్ట్ర సరిహద్దు వివాదాలు ప్రారంభమయ్యాయి. ఈ వివాదాలను పరిష్కరించుకునేందుకు ఇరు రాష్ట్రాలు సమావేశమవుతున్నాయని మిజోరం ముఖ్యమంత్రి జోరమ్‌తంగా చెప్పారు.
అసోం, మిజోరం మధ్య సరిహద్దు వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించుకోవాలని కేంద్ర ప్రభుత్వం కోరుకుంటోందని అధికారు తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో.. ఇద్దరు ముఖ్యమంత్రులు ఎప్పటికప్పుడు చర్చిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: కష్టకాలంలో కూలీ సాహసం- కాలి నడకన హైదరాబాద్ టూ అసోం!