బ్యాంకులకు రుణాలు ఎగవేసిన కేసులో భాగంగా భారత్‌కు రానున్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి ముంబయి ఆర్థర్ రోడ్డులోని సెంట్రల్ జైలులో ప్రత్యేక గదిని ఏర్పాటు చేసినట్లు సంబంధిత అధికారి తెలిపారు. తనను భారత్‌కు పంపించకూడదంటూ ఆయన చేసిన విజ్ఞప్తిని గురువారం నైరుతి లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేటు కోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన భారత న్యాయస్థానంలో హాజరై సమాధానం చెప్పాల్సి ఉందని లండన్ జడ్జీ శ్యామ్యూల్ గూజీ వ్యాఖ్యానించారు.
ఈ నేపథ్యంలో నీరవ్ కోసం ప్రత్యేక సెల్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆయన ఆరోగ్యం దృష్ట్యా ముంబయికి వచ్చిన వెంటనే కారాగారంలో వసతులతో కూడిన 12వ నంబర్ బ్యారాక్‌కు పంపించనున్నట్లు జైలు అధికారి శుక్రవారం తెలిపారు. ఇక్కడి జైలులో ఖైదీల సంఖ్య తక్కువగా ఉండటంతో ప్రత్యేక గది ఏర్పాటు చేయడం సులభమైందని అధికారి తెలిపారు.
జైలులో ఆయనకు కాటన్ వస్త్రం, దిండు, బెడ్‌షీట్, దుప్పటి అందించనున్నట్లు అధికారి వివరించారు. నీరవ్ మోదీని భారత్‌కు రప్పించిన వెంటనే ఆయనకు కారాగారంలో స్పెషల్ సెల్ ఏర్పాటు చేయాలనే విషయంపై గతంలోనే మహరాష్ట్ర జైళ్ల విభాగం కేంద్రంతో చర్చించింది. దీంతో ఆయనకు ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని కేంద్రం సూచించింది.
ఇదీ చదవండి: 'తీర్పు వచ్చినా.. నీరవ్ రావడం కొంచెం కష్టం'