కొవిడ్-19 రెండో దశ విజృంభణను సమర్థంగా ఎదుర్కోవటానికి ప్రభుత్వం సర్వశక్తులు ఒడ్డుతోంది. సైనిక దళాల్లోని పశు వైద్య విభాగం(రిమౌంట్ వెటర్నరీ కోర్)లోని వైద్యులు, ఇతర సిబ్బందిని ఇందుకోసం రంగంలోకి దించింది.
కొవిడ్ బాధితుల సహాయ కేంద్రాలను నిర్వహించటానికి వీరిని వినియోగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా 18 మంది అధికారులు, 120 మంది జూనియర్ కమిషన్డ్ అధికారులు (జేసీఓలు), ఇతర సిబ్బందిని దిల్లీ, లఖ్నవూ, అహ్మదాబాద్, వారణాసి, పట్నాలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కొవిడ్ కేంద్రాల్లో నియమిస్తామన్నారు. ఈ కేంద్రాల్లో త్రివిధ దళాల సిబ్బంది పనిచేస్తున్నారు.
బంధువులకు సమాచారం అందించేందుకు..
ఆక్సిజన్ సరఫరా వ్యవస్థలను పునరుద్ధరించటం, కొవిడ్ పడకలు ఏర్పాటు చేయటం, ఇన్ఫెక్షన్ కట్టడిలో పౌర అధికారులకు సాయం అందించటం వంటి సేవలను వీరు అందిస్తున్నారు. కొవిడ్ సంక్షోభ నిర్వహణ కమిటీని కూడా రక్షణ శాఖ ఏర్పాటు చేసింది.
తాజాగా ఈ కేంద్రాల్లో నియమితులయ్యే సైనిక దళాల పశు వైద్య విభాగం సిబ్బందిని.. తాత్కాలిక కొవిడ్ ఆస్పత్రుల్లోని రోగుల యోగక్షేమాలను ఆరా తీయటానికి వచ్చే బంధువులకు సమాచారం అందించటానికి వినియోగించనున్నట్లు అధికారులు తెలిపారు. తద్వారా అక్కడి వైద్య సిబ్బందిపై భారాన్ని తగ్గించటానికి వీలవుతుందని చెప్పారు.
కొవిడ్-19.. జూనోటిక్ వ్యాధి ఇలాంటి ఇన్ఫెక్షన్లను కలిగించే సూక్ష్మజీవులు జంతువుల నుంచి మానవులకు వ్యాపిస్తాయి. జంతువుల్లో వస్తున్న వ్యాధులపై పరిశోధనలో సైనిక పశువైద్య విభాగానికి అపార అనుభవం ఉంది. జూనోటిక్ వ్యాధుల నివారణకూ కృషి చేస్తోంది.
ఇదీ చదవండి : 'జులై-ఆగస్టు కల్లా దేశంలో సరిపడా టీకాలు'