MRSAM air defence missile test: మధ్యశ్రేణి గగనతల క్షిపణి రక్షణ వ్యవస్థను భారత సైన్యం విజయవంతంగా ప్రయోగించింది. ఒడిశాలోని బాలేశ్వర్ నుంచి 'ఎంఆర్ఎస్ఏఎం' క్షిపణి వ్యవస్థ ప్రయోగం చేపట్టింది. నిర్దేశిత లక్ష్యాన్ని క్షిపణి నేరుగా ఢీకొట్టిందని డీఆర్డీఓ స్పష్టం చేసింది. ఉదయం 10.30 గంటలకు ప్రయోగం నిర్వహించినట్లు పేర్కొంది. సుదూరంలో ఉన్న హైస్పీడ్ గగనతల లక్ష్యాన్ని విజయవంతంగా అడ్డుకున్నట్లు తెలిపింది.
India Israel missile development: ఇండియా-ఇజ్రాయెల్ సంయుక్తంగా ఈ క్షిపణి వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నాయి. భారత్ నుంచి డీఆర్డీఓ, ఇజ్రాయెల్‌కు చెందిన డైరెక్టరేట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యమయ్యాయి. విమానాలు, హిలికాప్టర్లు, యాంటీ షిప్ మిసైళ్లను ధ్వంసం చేసేలా ఈ క్షిపణి వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నారు. బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణులను సైతం ఇది అడ్డుకోగలదు. 60 కేజీల వార్హెడ్లను మోసుకెళ్లే క్షిపణులు ఇందులో ఉంటాయి.
70 కి.మీ. దూరంలోని..
ఇప్పటికే ఈ క్షిపణి వ్యవస్థ వాయుసేన అమ్ముల పొదిలో చేరింది. ప్రస్తుతం సైన్యం కోసం ప్రయోగాలు జరుగుతున్నాయి. ఈ క్షిపణి 70 కి.మీ. దూరంలోని లక్ష్యాలను శబ్ద వేగాన్ని మించిన వేగంతో దూసుకెళ్లి ధ్వంసం చేయగలదు. అత్యాధునిక రేడియో ఫ్రీక్వెన్సీ సీకర్ ద్వారా శత్రు విమానాలు, హెలికాప్టర్లు, గైడెడ్ బాంబులు, క్రూజ్ క్షిపణులను గుర్తించి కూల్చివేస్తుంది. దేశీయంగా అభివృద్ధి చేసిన డ్యూయల్ పల్స్ రాకెట్ మోటార్‌ని ఇందులో ఉపయోగించారు.
ఇదీ చదవండి: సముద్రంపై తేలియాడే వంతెన.. నడుస్తుంటే సూపర్ కిక్!