దేశంలో కరోనా ఉద్ధృతంగా వ్యాపిస్తున్న వేళ.. సాయుధ దళాలకు కేంద్రం అత్యవసర ఆర్థిక అధికారాలను కల్పించింది. దీని ద్వారా వైద్యసేవలు అందించేందుకు అవసరమైన పరికరాలను, వసతులను సమకూర్చుకునేందుకు సైన్యానికి వెసులుబాటు లభించనుంది. రెండో దశలో కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న నేపథ్యంలో అవసరమైన చోట్ల సాయుధ బలగాల సేవలను వినియోగించుకోవచ్చని ఇదివరకే రాష్ట్రాలకు సూచించింది కేంద్రం. ఆయా అవసరాల మేరకు రాష్ట్రాలతో కలిసి పని చేయాలని ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ ఉన్నతాధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా వారికి కొన్ని అధికారాలు ఇస్తూ నిర్ణయం తీసుకున్నట్లు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు.
ఫలితంగా.. రాష్ట్రంతో సంబంధం లేకుండా కొంత సొమ్ము వెచ్చించి ప్రజలకు వైద్య సదుపాయాలను అందించేందుకు సైన్యం కొన్ని ఏర్పాట్లు చేసుకునే వీలుంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో క్వారంటైన్ కేంద్రాల ఏర్పాటు, వైద్యపరికరాలు సమకూర్చుకోవడం తదితరాలకు అయ్యే ఖర్చులను కమాండ్ స్థాయి అధికారులే స్వయంగా ఖర్చు చేసే వీలు ఉంటుంది. ఈ మేరకు రక్షణ మంత్రి కార్యాలయం ట్విట్టర్‌లో వెల్లడించింది. "కరోనా సంక్షోభ సమయంలో ఇండియన్ ఆర్మీ సేవలను మరింత బలోపేతం చేసేందుకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ సాయుధ బలగాలకు అత్యవసర ఆర్థిక అధికారాలను ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు" అని పేర్కొంది.
ఇదీ చదవండి: జర్నలిస్ట్ రోహిత్ సర్దానా మృతి.. మోదీ దిగ్భ్రాంతి!